41 లక్షల ఖాతాలు మూసివేసిన ఎస్‌బీఐ

13 Mar, 2018 20:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పదినెలల్లో ఎస్‌బీఐ 41 లక్షలకు పైగా ఖాతాలను మూసివేసింది. తమ ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించని ఖాతాదారులకు అకౌంట్ల రద్దుతో ఎస్‌బీఐ షాక్‌ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ ఆర్‌టీఐ కింద రాబట్టిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది.  ఫిబ్రవరి 28న ఎస్‌బీఐ ఈ మేరకు దరఖాస్తుదారుకు లిఖితపూర్వకంగా వివరాలు అందించినట్టు ప్రభాత్‌ ఖబర్ పేర్కొంది.

కనీస నిల్వలు నిర్వహించని ఖాతాలపై విధించే జరిమానాను 75 శాతం తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించిన రోజే ఖాతాల మూసివేత నిర్ణయం బహిర్గతమైంది. మెట్రో నగరాల్లో కనీస నెలవారీ నిల్వలు రూ 3000, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ 2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ 1000గా నిర్వహించాలని ఎస్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆరేళ్ల విరామం అనంతరం గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలను ఎస్‌బీఐ అమలు చేస్తోంది.

మరిన్ని వార్తలు