ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

3 Sep, 2018 02:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.2 శాతం వరకు పెంచుతూ నిర్ణయం ప్రకటించాయి. దీనివల్ల గృహ, ఆటో, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు మరికాస్త భారం కానున్నాయి. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఎస్‌బీఐ 20 బేసిస్‌ పాయింట్లు మేర (0.20 శాతం) పెంపును చేపట్టింది. మూడేళ్ల వరకు అన్ని కాల వ్యవధుల రుణాలకు ఇది వర్తిస్తుంది.

ఒక రోజు నుంచి ఒక నెల వరకు ఎంసీఎల్‌ఆర్‌ 7.9 శాతం నుంచి 8.1 శాతానికి పెరిగింది. ఏడాది కాల వ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. చాలా వరకు రిటైల్‌ రుణాలకు ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ ప్రామాణిక రేటుగా అమలవుతోంది. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ కూడా 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ 0.15 శాతం పెరిగి 8.55 శాతానికి చేరింది. ఈ రెండు బ్యాంకులు కూడా చివరిగా ఈ ఏడాది జూన్‌లో రుణ రేట్లను సవరించాయి.   

>
మరిన్ని వార్తలు