ఓటీపీతో ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు

28 Dec, 2019 06:36 IST|Sakshi

రూ. 10 వేల పైబడిన లావాదేవీలకు జనవరి 1 నుంచి అమల్లోకి

రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే. మిగతా వేళల్లో ఇప్పటి మాదిరే ఓటీపీ లేకుండా నగదును తీసుకోవచ్చు. అలాగే, రూ.10వేల లోపు నగదును ఇక ముందూ ఓటీపీ లేకుండా రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. జనవరి 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది.

ఓటీపీ విధానం ఇలా..
► కార్డును ఏటీఎం మెషీన్‌లో ఉంచి చివర్లో నగదు మొత్తాన్ని టైప్‌ చేసి ఓకే చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. నంబర్‌ను ప్రవేశపెట్టడం ద్వారానే నగదు ఉపసంహరణకు వీలవుతుంది.

► ఎస్‌బీఐ ఏటీఎంలలోనే ఈ విధానం. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం ఉండదు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ విధానంలోకి మళ్లితే అప్పుడు అన్ని చోట్లా ఓటీపీ అవసరపడుతుంది.  

► ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకుంటే కుదరదు. ఎందుకంటే కచ్చితంగా ఓటీపీ ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా