ద్రవ్యోల్బణం, ఎస్‌బీఐ ఫలితాలపై దృష్టి

10 Aug, 2015 02:02 IST|Sakshi
ద్రవ్యోల్బణం, ఎస్‌బీఐ ఫలితాలపై దృష్టి

ఈ వారం గణాంకాలు
- 12న రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా
- 14న టోకు ద్రవ్యోల్బణం
ఈ వారం ఫలితాలు
- ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, సన్‌ఫార్మా
న్యూఢిల్లీ:
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, చివరిదశ కార్పొరేట్ ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేశారు. జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వచ్చే బుధవారం వెలువడనున్నాయి. టోకు ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడవుతుంది. మార్కెట్లో పెట్టుబడుల కోసం ఈ గణాంకాల తీరును ఇన్వెస్టర్లు పరిశీలిస్తారని క్యాపిటల్ వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు.
  .
కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరిదశకు వచ్చింది. ఈ దశలో ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, సన్‌ఫార్మా తదితర బ్లూచిప్ కంపెనీలు క్యూ1 ఫలితాల్ని ఈ వారం ప్రకటించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో అనూహ్యమైనవి ఏవీ లేవని, దాంతో ఇన్వెస్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని నిపుణులు చెప్పారు. ఈ వారం వెల్లడయ్యే బ్లూచిప్ ఫలితాలు ఆశ్చర్యకరంగా వుంటే మార్కెట్ ట్రెండ్ మారుతుందని వివేక్ గుప్తా వివరించారు.
 
పార్లమెంటు వైపు చూపు
పార్లమెంటులో భూసేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లుల ప్రగతిపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఇప్పటివరకూ వివాదాల కారణంగా పార్లమెంటు సమావేశాల్లో బిల్లులకు సంబంధించి ముందడుగు ఏదీ పడలేదని, ఈ వారమైనా ప్రగతి వుండవచ్చన్న ఆశలు ఇన్వెస్టర్లలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆగస్టు 13తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
 
అమెరికా జాబ్స్ డేటాకు స్పందన..
గత శుక్రవారం వెలువడిన అమెరికా జాబ్స్ డేటాకు స్పందనతో ఈ సోమవారం మార్కెట్ మొదలవుతుందని విశ్లేషకులు తెలిపారు. జూలై నెలలో అమెరికాలో కొత్త ఉద్యోగ కల్పన అంచనాలకంటే మెరుగ్గా జరిగినట్లు డేటా వెలువడటంతో సెప్టెంబర్ నెలలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దాంతో శుక్రవారం అమెరికా స్టాక్ సూచీలు క్షీణించాయి. మన దేశంలో ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలను బట్టి ఇక్కడ రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు నెలకొంటే మార్కెట్ పెరుగుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ టెక్నికల్ హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అయితే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చని ఆర్‌బీఐ భావిస్తే , ఇక్కడి వడ్డీ రేట్ల తగ్గుదలకు బ్రేక్‌పడుతుందని, ఈ దిశగా అంచనాలు మార్కెట్‌ను క్షీణింపచేస్తుందని, వెరసి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జేమ్స్ విశ్లేషించారు.
 
గతవారం మార్కెట్...
గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 122 పాయింట్ల పెరుగుదలతో 28,236 పాయింట్ల వద్ద ముగిసింది. కాగ్నిజెంట్ మంచి గెడైన్స్‌ను ప్రకటించడంతో క్రితం వారం ఐటీ షేర్లు ర్యాలీ జరిపాయి.
 
ఐదు రోజుల్లో 2,200 కోట్ల పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లో ఆగస్టు నెల తొలి ఐదు ట్రేడింగ్ రోజుల్లో రూ. 2,200 కోట్లు పెట్టుబడి చేశారు. ఆగస్టు 3-7 తేదీల మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల్లో రూ. 1,552 కోట్లు, రుణపత్రాల్లో రూ. 631 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.

మరిన్ని వార్తలు