షేర్‌ మార్కెట్‌ కింగ్‌... ఎస్‌బీఐ!

19 Apr, 2017 01:17 IST|Sakshi
షేర్‌ మార్కెట్‌ కింగ్‌... ఎస్‌బీఐ!

ప్రభుత్వ రంగ సంస్థల్లో నెంబర్‌–1 స్థానానికి
మార్కెట్‌ విలువ పరంగా ఓఎన్‌జీసీని వెనక్కి నెట్టిన ఎస్‌బీఐ
ప్రయివేటు సంస్థలనూ కలిపిచూస్తే... ఎస్‌బీఐకి 5వ స్థానం
మొదటి స్థానంలో టీసీఎస్‌; నువ్వానేనా అంటున్న రిలయన్స్‌
ఓఎన్‌జీసీని తోసిరాజని అగ్రస్థానంలోకి  


ముంబై:  స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థేదో తెలుసా? ఇప్పటివరకూ ఓఎన్‌జీసీ. కానీ మంగళవారం ఈ స్థానాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆక్రమించింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ఓఎన్‌జీసీ మార్కెట్‌ క్యాప్‌ (మొత్తం షేర్ల విలువ) రూ.2,32,346 కోట్లుగా ఉండగా, ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ దీనికంటే రూ.2,962 కోట్లు అధికంగా రూ.2,35,308 కోట్ల స్థాయికి చేరింది. ఇక ప్రయివేటు సంస్థల్ని  కూడా కలుపుకొంటే... స్టాక్‌ మార్కెట్లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అగ్ర స్థానంలో ఉన్న తొలి పది కంపెనీల్లో ఎస్‌బీఐ ఐదో స్థానంలో, ఓఎన్‌జీసీ ఏడో స్థానంలో నిలిచాయి. ఒకప్పుడు అధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీగా  ఓఎన్‌జీసీయే ఉండేది. ఎస్‌బీఐ 0.1 శాతం లాభపడి రూ.290 వద్ద, ఓఎన్‌జీసీ 1.1 శాతం క్షీణించి రూ.181 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎస్‌బీఐ 16 శాతం పెరగ్గా, ఓఎన్‌జీసీ 4 శాతం నష్టపోయింది.

ఇంట్రాడేలో అగ్రస్థానంలోకి రిలయన్స్‌..
కాగా ఇంట్రాడేలో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న భారత కంపెనీగా ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) నిలిచింది. కానీ ట్రేడింగ్‌ చివరవరకూ దీనిని నిలుపుకోలేకపోయింది. చివరికి  1.5% క్షీణించి రూ.1,370 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.4,45,579 కోట్లకు పరిమితమైంది. టీసీఎస్‌ 0.5% నష్టపోయి రూ.2,309 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.4,54,903 కోట్లుగా ఉంది.

నాలుగేళ్ల క్రితం అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న భారత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను తోసిరాజని టీసీఎస్‌ ముందుకెళ్లింది. అప్పటి నుంచీ అది తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. టెలికం సంస్థ జియో కారణంగా రిలయన్స్‌ ఇటీవల బాగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆర్‌ఐఎల్‌ 27% పెరగ్గా, టీసీఎస్‌ 2% నష్టపోయింది. ఒక కంపెనీ షేర్‌ ప్రస్తుత మార్కెట్‌ ధరను, అ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాప్‌గా పరిగణిస్తారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు