విలీన బాటలో మరో అడుగు!

27 Sep, 2016 01:18 IST|Sakshi
విలీన బాటలో మరో అడుగు!

త్వరలో ఆర్‌బీఐకి ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల వాటాదారులు ధ్రువీకరించిన స్కీమ్

న్యూఢిలీ:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఐదు అనుబంధ బ్యాంకులు త్వరలో తమ వాటాదారులు ధ్రువీకరించిన విలీన స్కీమ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి సమర్పించనున్నాయి. విలీన బ్యాంకుల షేర్‌హోల్డర్ల లిఖితపూర్వక అభ్యంతరాల పరిశీలనకు ఎస్‌బీఐ ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను తన బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు సోమవారం పరిశీలించినట్లు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. విలీనం విషయమై ఆగస్టు 18 స్కీమ్‌ను యథాతథంగా బోర్డ్ ఆమోదించినట్లు కూడా పేర్కొంది.

షేర్‌హోల్డర్ల అభ్యంతరాలపై ఎస్‌బీఐ నిపుణుల కమిటీ నివేదికను, అలాగే బోర్డ్ ఆమోదించిన ఆగస్టు 18 స్కీమ్‌ను పరిశీలన, ఆమోదాల నిమిత్తం త్వరలో ఆర్‌బీఐకి సమర్పించడం జరుగుతుందని వివరించింది.  పరిశీలన, ఆమోదం తరువాత వీటిని ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆయా అంశాలకు అనుగుణంగా 1955 ఎస్‌బీఐ యాక్ట్ 35వ సెక్షన్ కింద కేంద్రం విలీన  ఉత్తర్వు జారీ చేస్తుంది. ఎస్‌బీబీజేతోపాటు మరికొన్ని అనుబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ) లు కూడా సోమవారం ఈ తరహా ప్రకటనలనే చేశాయి. వీటితోపాటు మరో రెండు అనుబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా అలాగే భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

 స్వాప్ రేషియోల మార్పు!
కాగా ఎస్‌బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్కెట్‌లో లిస్టయిన ఎస్‌బీటీ, ఎస్‌బీబీజే, ఎస్‌బీఎంలకు సంబంధించి షేర్‌హోల్డర్ల కీలక అభ్యంతరాన్ని పరిశీలనలోకి తీసుకుని మిగిలిన వాటిని తిరస్కరించినట్లు ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ (అసోసియేట్స్ అండ్ సబ్సిడరీస్) నీరజ్ వ్యాస్ తెలిపారు. షేర్ల మార్పిడి (స్వాప్ రేషియో)లో మార్పులు చేయాలన్నది పరిశీలనలోకి తీసుకున్న కీలక అంశంగా వివరించారు. రేషియోను తిరిగి ధ్రువీకరించాలని నేటి సమావేశాల్లో ఎస్‌బీటీ, ఎస్‌బీబీజే, ఎస్‌బీఎం బోర్టులు కూడా నిర్ణయించడం గమనార్హం. ‘ఈ ప్రతిపాదనను ఎస్‌బీఐ బోర్డ్‌కు రెండు, మూడు రోజుల్లో పంపడం జరుగుతుంది.

తుది నిర్ణయం తరువాత దీనిని ఎస్‌బీఐ బోర్డ్ ఆర్‌బీఐకి పంపుతుంది. దీనిని ధ్రువీకరించి కేంద్రానికి ఆర్‌బీఐ సమర్పిస్తుంది. తదనుగుణంగా తదుపరి నిర్ణయం ఉంటుందని’  స్వాప్ గురించి తాజా ప్రక్రియను వ్యాస్ వివరించారు. ఎస్‌బీఐ బోర్డ్ ఆగస్టు 18న చేసిన ప్రకటన ప్రకారం, ఎస్‌బీబీఐ షేర్‌హోల్డర్లు తమ ప్రతి 10 షేర్లకూ (రూ.10 ముఖవిలువ) ఎస్‌బీఐకి చెందిన 28 షేర్లను (రూ.1 ముఖవిలువ) పొందుతారు. ఎస్‌బీఎం, ఎస్‌బీటీ షేర్‌హోల్డర్ల విషయంలో ఈ షేర్ల సంఖ్య 22గా ఉంది.  ఇక భారతీయ మహిళా బ్యాంక్ ప్రతి 100 కోట్ల ఈక్విటీ షేర్లకు (రూ.10 ముఖవిలువచొప్పున) రూ.1 ముఖ విలువ కలిగిన 4,42,31,510 ఎస్‌బీఐ షేర్లు పొందుతుంది.

మార్చి నాటికి విలీన ప్రక్రియ పూర్తి
విలీన ప్రక్రియ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమై,  వచ్చే ఏడాది మార్చినాటికి ముగియాలన్నది ప్రణాళిక అని ఇటీవల ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే.  భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్‌బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది.  24,000 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది.  ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరిస్తుంది. అతిపెద్ద భారత ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది.  36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలుసహా ప్రస్తుతం  ఎస్‌బీఐ  16,500 బ్రాంచీలను కలిగిఉంది. 2008లో ఎస్‌బీఐలో మొదటిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటుతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డోర్ విలీనం జరిగింది.

>
మరిన్ని వార్తలు