జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌?

25 Feb, 2019 01:07 IST|Sakshi

యోచనలో ఎస్‌బీఐ!!

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోందని సమాచారం. నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్‌ ఎయిర్‌వేస్‌ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యవస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర  మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)ఇటీవలే ఆమోదం తెలిపారు. మరోవైపు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది(ఈ విషయమై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది). ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో  దివాలా పిటిషన్‌ విషయమై ఎస్‌బీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే  దీనిపై ఎస్‌బీఐ గానీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.  

కాగా ఈ నెల 21న జరిగిన ఈజీఎమ్‌లో వివిధ ప్రతిపాదనలపై ఓటింగ్‌కు ఇతిహాద్‌ కంపెనీ దూరంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24% వాటా ఉంది. ఎస్‌బీఐ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)ల నుంచి మరిన్ని అదనపు నిధులు, ఈక్విటీ కేటాయింపు తదితర అంశాలపై మరింత స్పష్టత కోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ వేచి చూస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎస్‌బీఐ, ఎన్‌ఐఐఎఫ్‌లు 51% వాటా తీసుకోవాలని, దీని కోసం ఈ రెండు సంస్థలు రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఇతిహాద్‌ కోరుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించా యి.  తాము ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చిన కంపెనీపై ఎన్‌సీఎల్‌టీలో  దివాలా పిటిషన్‌ను దాఖలు చేస్తా యి. దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపితే సదరు సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

మరిన్ని వార్తలు