ఎస్‌బీఐ లాభం రూ.3,692 కోట్లు

12 Aug, 2015 02:53 IST|Sakshi
ఎస్‌బీఐ లాభం రూ.3,692 కోట్లు

క్యూ1లో 10% వృద్ధి...
- మొత్తం ఆదాయం 10 శాతం అప్; రూ.44,731 కోట్లు
- మొండిబకాయిలు తగ్గుముఖం...
ముంబై:
దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,692 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,349 కోట్లతో పోలిస్తే లాభం 10.2 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 10 శాతం వృద్ధి చెంది రూ.44,731 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఇతర ఆదాయం జోరందుకోవడం, మొండిబకాయిల తగ్గుదలతో కేటాయింపులు కూడా దిగిరావడం వంటివి లాభాలు పుంజుకోవడానికి దోహదం చేశాయి.  కాగా, జూన్ క్వార్టర్‌లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) స్వల్పంగా 3.6 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.13,732 కోట్లుగా నమోదైంది.

ఇతర ఆదాయం(వడ్డీయేతర) మాత్రం 19.7 శాతం దూసుకెళ్లి రూ.5,088 కోట్లకు చేరింది. ఫీజుల ఆదాయం(రూ.3,202 కోట్లు; 13 శాతం అప్) భారీగా పెరగడమే దీనికి కారణం. అయితే, దేశీ కార్యకలాపాలపై నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) క్యూ1లో 3.29 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎన్‌ఐఎం 3.54 శాతంగా ఉంది. దీనికి ప్రధానంగా బేస్ రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గడమే కారణమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, సీఎఫ్‌ఓ అన్షులా కాంత్ పేర్కొన్నారు.
 
కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: ఇతర అనుబంధ సంస్థలన్నింటితో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఎస్‌బీఐ నికర లాభం క్యూ1లో రూ.4,714 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.4,448 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 4 శాతంం పెరిగి... రూ. 60,621 కోట్ల నుంచి రూ.62,927 కోట్లకు చేరింది.
 
మొండిబకాయిల తగ్గాయ్...: జూన్ క్వార్టర్‌లో బ్యాంక్ మొండిబకాయిలు కాస్త శాంతించాయి. మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) 4.29 శాతానికి(రూ.56,421 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్‌పీఏలు 4.9 శాతం(రూ.60,434 కోట్లు)గాా ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు కూడా 2.66 శాతం(రూ.31,884 కోట్లు) నుంచి 2.24 శాతానికి(రూ.28,669 కోట్లు) దిగొచ్చాయి. దీంతో క్యూ1లో మొండిబకాయిలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.3,359 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ మొత్తం రూ.3,903 కోట్లు. అయితే, గతేడాది మార్చి క్వార్టర్(క్యూ4)లో స్థూల ఎన్‌పీఏలు 4.25 శాతం, నికర ఎన్‌పీఏలు 2.12 శాతంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో మొండిబకాయిలు పెరగడం గమనార్హం.
 
‘మొండిబకాయిల సమస్యకు ఇక అడ్డుకట్టపడినట్లే. ఎన్‌పీఏల రికవరీ ఆశావహంగా కొనసాగుతోంది. దీంతో బ్యాంక్ రానున్నకాలంలో మరింత మెరుగైన పనితీరును నమోదుచేయగలదన్న విశ్వాసంతో ఉన్నాం. ఇక రుణ వృద్ధి పుంజుకుంటేనే మరింతగా వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,674 మంది బ్యాంక్ సిబ్బంది పదవీవిరమణ చేయనున్నారు. దీంతో కొత్తగా ఈ ఏడాదే 2,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకోవాలనేది మా ప్రణాళిక.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు