ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

26 Oct, 2019 05:40 IST|Sakshi
ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌

క్యూ2లో రూ.3,375 కోట్లు

కలిసొచ్చిన ‘బీమా’ వాటా విక్రయం 

మెరుగుపడిన రుణ నాణ్యత  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న  లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5% వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని,  ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వివరించారు.  మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది.  

స్టాండ్‌అలోన్‌ లాభం రూ.3,012 కోట్లు  
స్డాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212%)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ఉంటుందన్నారు.  

తగ్గిన మొండి బకాయిలు....
గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95% నుంచి 7.19%కి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి దిగొచ్చాయి.

నికర లాభం మూడు రెట్లు పెరగడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 7.5 శాతం లాభంతో రూ.282 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు