ఎస్‌బీఐ రికార్డ్‌ లాభం

6 Jun, 2020 09:03 IST|Sakshi

4 రెట్లు పెరిగి రూ.3,581 కోట్లకు నికర లాభం  

గత ఏడాదిలోనూ చరిత్రాత్మక లాభం  

అనుబంధ సంస్థల్లో వాటా విక్రయమే కారణం

మొండి బకాయిలు, కేటాయింపులు తగ్గాయ్‌

న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రికార్డ్‌ స్థాయి నికర లాభం(స్డాండ్‌అలోన్‌) సాధించింది. 2018–19 క్యూ4లో రూ.838 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నాలుగు రెట్లు(327%) పెరిగి రూ.3,581 కోట్లకు చేరిందని ఎస్‌బీఐ తెలిపింది. అనుబంధ సంస్థ, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌లో వాటా విక్రయంతో నిధులు లభించడం, మొండి బకాయిలు తగ్గడం తదితర కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.5,583 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.75,671 కోట్ల నుంచి రూ.76,028 కోట్లకు పెరిగింది.  మరిన్ని

వివరాలు...,  
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,488 కోట్లకు ఎగసింది. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం.  
ఎస్‌బీఐ కార్డ్స్‌ వాటా విక్రయం వల్ల రూ.2,731 కోట్లు, ఎస్‌బీఐ లైఫ్‌ వాటా విక్రయం వల్ల  రూ.3,484 కోట్ల నిధులు లభించాయి.   
2018–19లో రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.96 లక్షల కోట్లకు ఎగసింది.  
2019 మార్చి నాటికి 7.53 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 6.15 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 2.23 శాతానికి తగ్గాయి.  
2018–19 క్యూ4లో రూ.16,502 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏ కేటాయింపులు గత క్యూ4లో రూ.13,495 కోట్లకు తగ్గాయి.
యస్‌బ్యాంక్‌లో రూ.6,050 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది.  
ఈఎమ్‌ఐల మారటోరియమ్‌ ప్రయోజనాన్ని 21 శాతం మంది రిటైల్‌ ఖాతాదారులే వినియోగించుకున్నారు.  
బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 8% లాభంతో రూ.188 వద్ద ముగిసింది.

ప్రతి క్వార్టర్‌లోనూ రుణ నాణ్యతలో మెరుగుదల సాధిస్తూ వస్తున్నాం. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియోలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. రికవరీలు జూన్‌ క్వార్టర్‌లో  దెబ్బతిన్నా, సెప్టెంబర్‌ క్వార్టర్‌ నుంచి పుంజుకోగలవన్న ధీమా ఉంది. –రజ్‌నీశ్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌  

మరిన్ని వార్తలు