ఎస్‌బీఐ రూ.3,400 కోట్ల సమీకరణ

18 Jan, 2017 01:17 IST|Sakshi
ఎస్‌బీఐ రూ.3,400 కోట్ల సమీకరణ

డాలర్ల రూపంలో విదేశీ బాండ్ల జారీ
ముంబై: దేశీ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ... 50 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3,400 కోట్లు) నిధుల సమీకరణ కోసం విదేశీ బాండ్ల జారీకి తెరతీసింది. డాలర్‌ రూపంలో ఈ నిధులను సమీకరించింది. ఇష్యూ 3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ అయిందని.. ఐదేళ్ల కాల పరిమితి గల ఈ బాండ్‌లకు  వడ్డీరేటు 3.306 శాతంగా నిర్ణయించినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్లలో 10 బిలియన్‌ డాలర్ల మధ్యకాలిక బాండ్‌ల జారీలో భాగంగా ఈ బాండ్‌ల ఇష్యూను చేపట్టింది. లండన్‌లోని బ్రాంచ్‌ ద్వారా  ఎస్‌బీఐ ఈ నిధులను సమీకరిస్తోందని, బాండ్‌లను సింగపూర్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్‌ చేయనున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది.

ప్రతిపాదిత 50 కోట్ల డాలర్ల బాండ్‌ ఇష్యూకి మూడు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు(ఎస్‌ అండ్‌ పీ, మూడీస్, ఫిచ్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. ఎస్‌బీఐ చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో విదేశీ మార్కెట్లో డాలర్‌ బాండ్‌ల జారీ ద్వారా 30 కోట్ల డాలర్లను సమీకరించింది. అంతక్రితం 2014లో 125 కోట్ల డాలర్ల డాలర్‌ బాం డ్‌లను జారీచేసింది. ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా ప్రతిపాదిత 10 బిలియన్‌ డాలర్లలో ఇప్పటివరకూ ఎస్‌బీఐ 3.5 బిలియన్‌ డాలర్లను సమీకరించింది.

మరిన్ని వార్తలు