ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

30 Jul, 2018 14:49 IST|Sakshi
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు నేటి(జూన్‌ 30) నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. జనరల్‌, సీనియర్‌ సిటజన్ల కేటగిరీలు రెండింట్లోనూ వివిధ మొత్తాలు, డిపాజిట్‌ కాల వ్యవధులను బట్టి వడ్డీరేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. కోటి కంటే తక్కువ ఉన్న రిటైల్‌ డిపాజిట్లు ఏడాది నుంచి పదేళ్ల కాల వ్యవధిలో ఉన్న వాటికి ఈ కొత్త రేట్లు అమలు కానున్నాయి. సమీక్షించిన రేటు విధానం ప్రకారం.. ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 6.65 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగాయి. సీనియర్‌ సిటిజన్లకు కొత్త రేటు 7.2 శాతంగా నిర్ణయించారు. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లు 7.15 శాతం నుంచి 7.3 శాతం పెంచింది. 

ప్రతిపాదించిన ఈ వడ్డీరేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యువల్‌ చేసుకునే డిపాజిట్లకు వర్తించనున్నాయి. ఆర్‌బీఐ ద్వైపాక్షిక ద్రవ్య విధాన పరపతి సమీక్ష మరో మూడు రోజుల్లో ప్రకటించనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీరేట్లను సమీక్షించింది. మూడు రోజుల పాటు భేటీ కానున్న ద్రవ్య విధాన పరపతి కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 1న ఈ పాలసీ ప్రకటన ఉండనుంది. గత జూన్‌ సమీక్షలో ఆర్‌బీఐ రేట్లను 0.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సారి ఆర్‌బీఐ స్టేటస్‌ క్వోను పాటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు