షాకింగ్‌ : ఈ ఏడాది కొత్త కొలువులు కొన్నే..

13 Jan, 2020 17:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో 2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాల సంఖ్య పడిపోతుందని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 89.7 లక్షల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి రాగా 2020లో ఆ సంఖ్య కంటే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు తక్కువగా జనరేట్‌ అవుతాయని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్‌ వెల్లడించింది. రూ 15,000లోపు వేతనాలు కలిగిన ఉద్యోగ నియామకాలపై ఈపీఎఫ్‌ఓ గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందింది. ఈ గణాంకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రయివేటు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు. 2004 నుంచి ఈ ఉద్యోగాలు ఎన్‌పీఎస్‌కు బదలాయించడంతో ఈపీఎఫ్‌ఓ డేటా వీటిని కవర్‌ చేయలేదు. మరోవైపు ప్రస్తుత ధోరణుల ప్రకారం ఎన్‌పీఎస్‌ విభాగంలోనూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 2020 ఆర్థిక సంవత్సరంలో గతంతో పోలిస్తే 39,000 ఉద్యోగాలు తక్కువగానే సృష్టించే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.

అసోమ్‌, బిహార్‌, రాజస్ధాన్‌, ఒడిషా, యూపీలకు వలసలు వెళ్లిన కార్మికులు తమ ఇళ్లకు చేరవేసే మొత్తాలు (రెమిటెన్స్‌లు) గణనీయంగా తగ్గాయనే గణాంకాలనూ ఈ నివేదిక ప్రస్తావించింది. దివాళా ప్రక్రియలో కేసుల పరిష్కారంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ఆయా కంపెనీలు తమ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యలో కోతవిధించడం కూడా కొలువులు తగ్గిపోతున్న పరిస్థితికి కారణమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. దేశంలో పేదలు, ఇతరులకు గత కొన్నేళ్లుగా వలస వెళ్లడం ప్రధాన జీవన వనరుగా మారుతున్న పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొంది. అసంతులిత వృద్ధి ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వలస వెళ్లడం అధికమవుతోంది. ఆయా రాష్ట్రాలకు వలస వెళ్లిన ప్రజలు, కార్మికులు తమ స్వస్ధలాలకు డబ్బు చేరవేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారని నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనంతో వాణిజ్య సంస్థలు, కార్మికులు రుణాలపై అధికంగా ఆధారపడే పరిస్థితి ఎదురై ఆర్థిక​ వ్యవస్థ మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ నివేదిక విధాన నిర్ణేతలను హెచ్చరించింది.

మరిన్ని వార్తలు