ఎస్‌బీఐ షాకింగ్‌ : క్యూ1లో భారీ నష్టాలు

10 Aug, 2018 14:33 IST|Sakshi
ఎస్‌బీఐ ఫలితాలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ షాకింగ్‌ ఫలితాలను విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.4,876 కోట్ల స్టాండలోన్‌ నికర నష్టాలను నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.242 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. కానీ విశ్లేషకుల అంచనాలను ఎస్‌బీఐ తలకిందులు చేసింది. గత మార్చి త్రైమాసికంలో కూడా ఇదే విధంగా రూ.7718.17 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌కు రూ.2,005.53 కోట్ల లాభాలు ఉన్నాయి. 

ఏడాది ఏడాదికి ప్రొవిజన్లు భారీగా రూ.19,228.26 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ప్రొవిజన్లు రూ.8,929.48 కోట్లగా మాత్రమే ఉన్నాయి. అయితే బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు ఈ త్రైమాసికం మొత్తం రుణాల్లో 10.69 శాతానికి పడిపోయాయి. మార్చి త్రైమాసికంలో ఇది 10.91 శాతంగా రికార్డయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 5.73 శాతం నుంచి 5.29 శాతానికి తగ్గాయి. వడ్డీలు ఈ త్రైమాసికంలో 7.1 శాతానికి పెరిగి రూ.58,813.18 కోట్లగా రికార్డైనట్టు బ్యాంక్‌ వెల్లడించింది. ఫలితాల ప్రకటన అనంతరం ఈ బ్యాంక్ షేర్లు 5.1 శాతం క్షీణించాయి. 

 

మరిన్ని వార్తలు