జెట్‌ విక్రయం టేకాఫ్‌!!

9 Apr, 2019 00:46 IST|Sakshi

బిడ్స్‌ ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన

సమర్పించడానికి ఆఖరు తేది ఏప్రిల్‌ 10

31.2 శాతం – 75 శాతం దాకా వాటాల విక్రయం

లుఫ్తాన్సా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి

ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్స్‌ (ఎస్‌ఐ), ఆర్థిక ఇన్వెస్టర్స్‌ (ఎఫ్‌ఐ) నుంచి బిడ్స్‌ను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన ప్రకారం .. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 శాతం వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్లను (75 శాతం వాటాలు) విక్రయించే అవకాశం ఉంది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేది ఏప్రిల్‌ 10. అర్హత పొందిన బిడ్డర్లు ఏప్రిల్‌ 30లోగా తుది బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.  కాగా ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సంస్థ ఈ బిడ్డింగ్‌ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది.

దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలమవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. పలు విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్‌లైన్‌ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మార్చి 25న జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటరు నరేష్‌ గోయల్, ఆయన భార్య జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి నిష్క్రమించారు. సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్‌ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి.  

ప్రకటన సారాంశం..
ఎస్‌బీఐ కన్సార్షియం ప్రకటన ప్రకారం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ వివిధ బ్యాంకుల నుంచి రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణాలను పొందింది. తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టడం జరిగింది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు సంబంధించిన అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ప్రకటన పేర్కొంది. దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవమున్న కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్‌ (ఎస్‌ఐ) కేటగిరీ కింద బిడ్స్‌ వేయొచ్చు. ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ మొదలైన వాటిని ఎఫ్‌ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్‌ఐలకు ఏవియేషన్‌ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్‌ వేసిన పక్షంలో .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి.  

ఆరు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి..
జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్‌స్టోన్, టీపీజీ క్యాపిటల్‌ వంటి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్‌ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది.  

సోమవారం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 3% పెరిగి రూ. 264.10 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు