ఎస్‌బీఐ తెలంగాణ సీజీఎంగా స్వామినాథన్‌

23 Nov, 2017 23:46 IST|Sakshi

 ప్రస్తుత సీజీఎం హర్దయాల్‌ ప్రసాద్‌ బదిలీ

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ హెడ్‌గా పదోన్నతి

రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా కొత్త బాస్‌ రానున్నారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్‌ జానకిరామన్‌ సీజీఎంగా రానున్నారు. ప్రస్తుతమున్న సీజీఎం హర్దయాల్‌ ప్రసాద్‌ పదోన్నతి మీద ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ హెడ్‌గా బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మరో నెల పాటు హర్దయాల్‌ ప్రస్తుత పదవిలోనే కొనసాగుతారని.. ఆ తర్వాతే స్వామినాథన్‌ బాధ్యతలు చేపడతారని తెలిసింది.

ఇదే విషయమై ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం నుంచి మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్వామినాథన్‌ ఎస్‌బీఐ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ గ్రూప్‌ జీఎంగా పనిచేస్తున్నారు. యాంటీ మనీ లాండరింగ్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ సర్టిఫైడ్‌ పూర్తి చేశారు. కార్పొరేట్‌ బ్యాంకింగ్, ట్రేడ్‌ ఫైనాన్స్‌ వంటి వాటిల్లో అపారమైన అనుభవముంది. ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్‌తో పాటు మరో 4 అసోసియేట్‌ బ్యాంకుల విలీనం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బీఐ తెలంగాణ సర్కిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి తెలంగాణలో 1,300 శాఖలు, 10 ఇన్‌ టచ్‌ బ్రాంచీలు, 2,964 ఏటీఎంలున్నాయి.

నేడు యోనో యాప్‌ ఆవిష్కరణ...
ఎస్‌బీఐ దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్‌ సర్వీస్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనో (వైవోఎన్‌వో) ఓమ్నీ చానల్‌ యాప్‌ను విడుదల చేయనుంది. ఢిల్లీలో ఆర్థ్ధికమంత్రి జైట్లీ నేడు (శుక్రవారం) ఈ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యోనోలో ఆర్థిక, బీమా సేవలతో పాటూ విద్యా, వైద్యం, వినోదం, పర్యాటకం వంటి 14 విభాగాల్లో సేవలను పొందొచ్చు. ఇందుకోసం అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, షాపర్స్‌ స్టాప్, కాక్స్‌ అండ్‌ కింగ్స్, థామస్‌ కుక్, యాత్ర, ఎయిర్‌ బీఎన్‌బీ, స్విగ్గీ, బైజూస్‌ వంటి 60కి పైగా సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

మరిన్ని వార్తలు