ఎస్‌బీఐ ఖాతా మూసివేత చార్జీల రద్దు

3 Oct, 2017 15:22 IST|Sakshi

 ఏడాది పైబడిన పొదుపు  ఖాతాలకు వర్తింపు

ఈ నెల నుంచే అమల్లోకి

ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పొదుపు ఖాతాల మూసివేత చార్జీల విషయంలో నిబంధనలను సడలించింది. దాదాపు ఏడాది పైబడిన పొదుపు ఖాతాలు మూసివేసిన పక్షంలో క్లోజింగ్‌ చార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జరిమానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కనీస బ్యాలెన్స్‌ నిబంధనలను సడలించిన ఎస్‌బీఐ తాజాగా అకౌంటు క్లోజింగ్‌ చార్జీలూ రద్దు చేయడం గమనార్హం.

ఈ నెల నుంచే సడలింపు అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ పేర్కొంది. ఖాతా తెరిచినప్పటికీ కనీస బ్యాలెన్స్‌ను మెయింటెయిన్‌ చేయలేక, పెనాల్టీలతో సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఇది వెసులుబాటుగా ఉంటుందని వివరించింది. 14 రోజుల ఫ్రీ లుక్‌ పీరియడ్‌లో మూసివేసిన ఖాతాలు మినహాయిస్తే.. ఆ గడువు దాటిన తర్వాత క్లోజ్‌ చేసే అకౌంట్లపై మాత్రం ఎస్‌బీఐ రూ. 500 మేర సర్వీస్‌ ట్యాక్స్‌ కింద వసూలు చేస్తోంది.  

కాగా, తాజాగా నిబంధనల సడలింపుతో సదరు ఖాతాదారులు తమ అవసరాలను బట్టి సాధారణ పొదుపు ఖాతాలను బేసిక్‌ ఖాతాలుగా (బీఎస్‌బీఏ) మార్చుకోవడానికి వీలవుతుందని ఎస్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి. పెనాల్టీలపై విమర్శలు వెల్లువెత్తుటంతో ఎస్‌బీఐ ఇప్పటికే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు