అతితక్కువ వడ్డీ రేటు ఎస్‌బీఐదే..!

3 Nov, 2017 00:59 IST|Sakshi

గృహ రుణ రేటులో 5 బేసిస్‌ పాయింట్ల కోత

దీనితో 8.30%కి డౌన్‌; వాహన రుణంపై 8.7%కి తగ్గింపు

న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీరేటును బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్వల్పంగా 5 బేసిస్‌ పాయింట్లు (0.5 శాతం) తగ్గించింది. 100 బేసిస్‌ పాయింట్లను ఒక శాతంగా పరిగణిస్తారు. దీనితో ఈ రేటు 8.30 శాతానికి చేరింది. వివిధ బ్యాంకుల గృహ రుణ రేట్లలో ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. నవంబర్‌ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ (ఎంసీఎల్‌ఆర్‌) రేటును 10 నెలల తరువాత బుధవారం ఎస్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. ‘‘తక్కువ రుణ రేటు, విస్తృత స్థాయి డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్, డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం వంటి సేవలు ఎస్‌బీఐ వినియోగదారులకు సంతృప్తినిస్తాయని విశ్వసిస్తున్నాం.’’ అని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్‌ బ్యాంకింగ్‌) పీకే గుప్తా పేర్కొన్నారు.

అర్హత కలిగిన వేతన కస్టమర్లకు 8.30 శాతం వార్షిక వడ్డీరేటున రూ.30 లక్షల వరకూ రుణం అందుబాటులో ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. 8.30% వడ్డీపై... అర్హత కలిగిన గృహ రుణ కస్టమర్లు ప్రధాని ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద రూ.2.67 లక్షల వడ్డీ సబ్సిడీ పొందే అవకాశం ఉందని కూడా బ్యాంక్‌ వివరించింది.

ఆటో రుణ రేటూ తగ్గింపు..!
ఆటో రుణాలపై వడ్డీరేటునూ బ్యాంక్‌ ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 8.70 శాతానికి పడింది. కారు రుణ వినియోగదారులపై వడ్డీరేటు శ్రేణి 8.70–9.20% శ్రేణిలో ఉంటుంది. ఇంతక్రితం ఈ శ్రేణి 8.75–9.25% ఉండేది. తీసుకునే రుణ మొత్తం, వ్యక్తిగత క్రెడిట్‌ స్కోర్‌ వంటి అంశాలపై తుది వడ్డీరేటు ఆధారపడి ఉంటుందని బ్యాంక్‌  పేర్కొంది.

అలహాబాద్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపు: అలహాబాద్‌ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణ రేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో దీనికి అనుసంధానమైన గృహ, కారు, ఇతర రిటైల్‌ రుణ రేట్లు తగ్గనున్నాయి. తాజా రేటు నవంబర్‌ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా