టెల్కోలకు సుప్రీం షాక్‌

25 Oct, 2019 04:32 IST|Sakshi

ఏజీఆర్‌పై ప్రతికూల తీర్పు

రూ. 92వేల కోట్ల రికవరీకి కేంద్రానికి అనుమతి

ఎయిర్‌టెల్, వొడాఐడియాలపై పెనుభారం

ప్రభుత్వం సమీక్షించాలి: టెల్కోలు

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్‌) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది.

డాట్‌ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి.   

వివాదం ఇదీ..
కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.

1.4 లక్షల కోట్లపైనే భారం
జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్‌ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్‌–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు.   

వొడాఐడియా షేరు కుదేల్‌..
లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్‌ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్‌ అయ్యింది. బీఎస్‌ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది.

కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్‌ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్‌ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ
సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది.  డిజిటల్‌ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు