-

‘ఆమ్రపాలి’పై సుప్రీం మండిపాటు

9 Aug, 2018 09:52 IST|Sakshi

15 రోజుల్లోగా ఆమ్రపాలి సంస్థ ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ ఎండీ, డైరెక్టర్లపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బుధవారం హెచ్చరించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించకుండా కోర్టుతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది. మరీ ఇంత తెలివిగా ప్రవర్తించడం సరికాదన్న ధర్మాసనం.. ఇన్వెస్టర్లకు న్యాయం చేసేందుకు మీ ఇళ్లను అమ్మడానికి కూడా కోర్టు వెనకాడబోదని ఎండీని హెచ్చరించింది. 15 రోజుల్లోగా ఆమ్రపాలి సంస్థ ఎండీ, డైరెక్టర్లకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర‍్ల నుంచి సొమ్ము సేకరించి.. ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. వేల మందిని నిరాశ్రయులను చేయాలని చూస్తున్న మిమ్మల్ని నిరాశ్రయులను చేసేందుకు.. వడ్డీతో సహా సొమ్మును వసూలు చేసేందుకు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉందని ఘాటుగా హెచ్చరించింది.

మీరు ఎలా పూర్తి చేయగలరు?
ఆమ్రపాలి గ్రూప్‌ చేపట్టిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ) ఆగస్టు 2న కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... 30 రోజుల్లోగా నిర్మాణ పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. నిర్మాణ పనులకు ఆటంకం కలిగించకుండా విద్యుత్‌ సరఫరాను యథావిథిగా కొనసాగించాలని ఆమ్రపాలి గ్రూప్‌తో జతకట్టిన పవర్‌ కంపెనీలను కోర్టు కోరింది.

మరిన్ని వార్తలు