పథకాలు భళా ఎంపిక ఇలా!

4 Jun, 2016 00:01 IST|Sakshi
పథకాలు భళా ఎంపిక ఇలా!

రాయితీల ఎంపికలో తొందరపడొద్దు
నిర్ధారించుకున్నాకే.. ముందడుగేయాలని సూచన


‘బుకింగ్ రోజు 25 శాతం.. మిగతా సొమ్ము గృహప్రవేశం రోజు కట్టండి’ ‘తొలి వంద మంది కస్టమర్లకు చ.అ.కు రూ.500 తగ్గింపు’ ‘రిజిస్ట్రేషన్ ఖర్చులో 25 శాతం తగ్గింపు’.. ‘క్లబ్/రిసార్ట్‌లో ఉచిత సభ్యత్వం’ ‘మాడ్యులర్ కిచెన్ ఉచితం (లేదా) కుటుంబంలో ఒకరికి ఫారిన్ ట్రిప్’
.. ఇవీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలు ప్రకటించే తాయిలాలు. పూర్వవైభవాన్ని సంతరించుకున్న భాగ్యనగర స్థిరాస్తి రంగం.. తగ్గుముఖం పట్టిన గృహరుణాల వడ్డీ రేట్లు.. కస్టమర్ల సెంటిమెంట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు రాయితీలతో ఊరిస్తున్నారు. ఎప్పుడైనా సరే రాయితీలనేవి రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే.

సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ధర, ప్రాంతం, వసతులు, సౌకర్యాలు ఎంత ముఖ్యమో.. బిల్డర్ గత చరిత్ర, రాయితీలూ అంతే ముఖ్యం. ఆఫర్లున్నాయనో.. ఇప్పుడు వదులుకుంటే మళ్లీ అందుకోలేమోననో తొందరపడ్డారో అసలుకే మోసం వస్తుంది. ఎల్‌ఈడీ టీవీ, వాషింగ్ మిషన్, హోమ్ థియేటర్లు, పవర్ బ్యాకప్, చ.అ.కు రూ.500 వరకూ తగ్గింపు, ఉచిత పార్కింగ్, స్టాంప్ డ్యూటీ కట్టక్కర్లేదు, క్లబ్బులో ఉచిత సభ్యత్వం.. ఇలా వివిధ ప్రకటనలు గుప్పించే డెవలపర్లు బోలెడు మంది. ప్రస్తుతానికి మార్కెట్లో అమ్మకాలూ పెద్దగా లేవు కాబట్టి ఫ్లాట్లు/ప్లాట్లను ఎలాగైనా విక్రయించాలని ఆరాటపడే సంస్థలకూ లెక్కేలేదు. అసలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇవి నిజంగానే అక్కరకొస్తాయా? అనే అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే..
రెండే రెండు కారణాల వల్ల ఇలాంటి పథకాల్ని చూసి కొనుగోలుదారులు ఆకర్షితులవుతారు. ఎలాగైనా సొంతిల్లు కొనాలన్న ఆత్రుత మొదటిది కాగా.. స్థిరాస్తి విలువలు ఎప్పుడైనా పెరుగుతాయనే నమ్మకం ఉండటమే రెండో కారణం. చెల్లింపులు కూడా విడతల వారీగా చేయాల్సి ఉంటుంది కాబట్టి సొంతిల్లు కొనాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అలా ఇల్లు కొనగానే ఇలా ఇంటి విలువ పెరుగుతుందని భావించేవారంతా.. తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. గత కొన్నేళ్లుగా వ్యక్తిగత గృహాలు, ఫ్లాట్ల విలువలు పెద్దగా పెరగలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ధరల దిద్దుబాటు భారీ స్థాయిలో జరగడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. కాబట్టి నివసించడానికే ఇల్లు కావాలని భావించేవారంతా డెవలపర్లు అందించే పథకాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి అడుగుముందుకేయాలి.
ఈఎంఐలు గృహప్రవేశం దాకా వద్దు..
ఈ పథకంలో గృహరుణం సాయంతో ఇల్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. నెలసరి వాయిదాలు కొనుగోలుదారులే భరించాలి. ఒకవేళ నిర్మాణ పనులు ఆలస్యమై.. గృహప్రవేశం ఆలస్యమైతే రుణచరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది డెవలపర్, బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య కుదిరే ఒప్పందం కాబట్టి, నిర్మాణం ఆలస్యమైతే కొన్నవారే భరించాలి. పైగా ఒకవైపు అద్దె ఇంట్లో ఉంటూనే మరోవైపు బ్యాంకు వాయిదా చెల్లించాలి. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆ ఫ్లాట్లను విక్రయించేసి బయటపడదామనుకుంటే.. కొన్ని కారణాల వల్ల కుదరదు. నెలసరి వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. ఫలితంగా భవిష్యత్తులో రుణాలు లభించడం కష్టమవుతుంది. ఇలాంటి పథకాల్లో బ్యాంకు అందించే వడ్డీ రేటునూ పరిశీలించాలి.

సాధారణ రేట్లకు సమానంగానే ఉందా? ఆర్‌బీఐ నిబంధనల మేరకు చలన వడ్డీ రేటు మారుతున్నప్పుడల్లా ఈ వడ్డీ రేటు కూడా తగ్గుతుందా? ఇంటి నిర్మాణం పూర్తయి అప్పగించిన తర్వాత వడ్డీ ఎంతుంటుందో రుణ ఒప్పంద పత్రాన్ని ఓసారి పరిశీలించాలి. పైగా నిర్మాణ పనులు మూడేళ్లు మించితే ముందస్తు నిర్మాణానికి సంబంధించిన వడ్డీ రాయితీని కూడా అందుకోలేరు. కాబట్టి ఈ పథకాల్ని పక్కాగా పరిశీలించాకే నిర్ణయానికి రావాలి. ఈ పథకాన్ని అందించే డెవలపర్ గత చరిత్రనూ క్షుణ్నంగా గమనించాకే అడుగుముందుకేయాలి.

 పార్కింగ్/రిజిస్ట్రేషన్..
ఇలాంటి పథకాల్ని డెవలపర్లు ప్రకటించినప్పుడు.. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత ధర ఎంత? అక్కడి చుట్టుపక్కల ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలెలా ఉన్నాయి? ఫ్లాటును ఎప్పుడు అందజేస్తారు? తదితర విషయాల్ని ఆరా తీయాలి. మార్కెట్ రేటు కంటే కాస్త ఎక్కువ రేటు పెట్టి ఇలాంటి రాయితీలను అందించే డెవలపర్లు లేకపోలేదు. కాబట్టి రాయితీలు ఇచ్చినప్పటికీ సకాలంలో ఫ్లాట్లను అందించకపోతే పరిస్థితి ఏంటి? నెలసరి అద్దె చెల్లిస్తారా? లేదా డెవలపర్ వడ్డీ ఏమైనా అందజేస్తాడా? ఓసారి కనుక్కోండి. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రంలో స్పష్టంగా రాతకోతలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా పరిహారం దక్కేలా చూసుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాయితీల బదులు నగదు రాయితీని అందజేయమని కోరాలి.

      అద్దె గ్యారంటీ ఇంటికి సంబంధించిన సొమ్ము పూర్తిగా చెల్లించినవారికి కొందరు డెవలపర్లు నెలసరి అద్దె చెల్లిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్త్తున్నారు. ఏడాదికి పదికి అటుఇటుగా ఈ సొమ్ము ఉండే అవకాశముంది. ఇలాంటి పథకాల్ని డెవలపర్ ప్రకటించాడంటే.. ఆయా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన నిధుల్ని బయటి నుంచి సేకరించడంలో కష్టమవుతుందని దానర్థం. ఒకవేళ తను అద్దె చెల్లించడంలో విఫలమైతే మీకు ఆర్థిక చిక్కులు తప్పవు. కాకపోతే మీ సొమ్మును కోర్టుల ద్వారా అయినా రాబట్టుకునేలా ఒప్పం ద పత్రం ఉండేలా చూసుకోవాలి. డెవల పర్ గతంలో ఇలాంటి పథకాలకు కొనుగోలుదారులకు సొమ్ము చెల్లించాడా? లేదా? తెలుసుకోవాలి.

బిల్డర్లకూ లాభమే..
సాఫ్ట్‌లాంచ్, ప్రీలాంచ్ ఆఫర్ల వంటి వాటితో కేవలం కొనుగోలుదారులకే కాదు.. నిర్మాణ సంస్థలకూ ప్రయోజనమే. ఎలాగంటే అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజె క్ట్‌కు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద ఆధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఈ లాంచ్ అమ్మకాలు సంస్థలకు కలిసొస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చిపెడతాయి. అంయితే ఇదంతా ఆయా నిర్మాణ సంస్థలకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధారపడుతుంది సుమీ.

మరిన్ని వార్తలు