పల్లెల్లోనూ స్కూటర్ల హవా!

27 Jan, 2018 01:03 IST|Sakshi

పెరుగుతున్న విక్రయాలు

గతంతో పోలిస్తే పెరిగిన ప్రాధాన్యం

డ్రైవింగ్‌ సౌలభ్యం, తగ్గిన ధరలే కారణం

మున్ముందు గ్రామాలదే మెజారిటీ వాటా  

(సాక్షి, బిజినెస్‌ విభాగం) :  గ్రామాల్లో స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. గ్రామీణులు మెల్లగా రోజువారీ అవసరాల కోసం కూడా స్కూటర్లపై ఆధారపడుతుండటంతో స్కూటర్ల విక్రయాల్లో పల్లెల వాటా పెరుగుతోంది. ద్విచక్ర వాహన పరిశ్రమ విక్రయాల్లో మిగిలిన మోడళ్లతో పోలిస్తే స్కూటర్ల వృద్ధి ఎంతో అధికంగా ఉంటుండగా... ఇటీవలి కాలంలో పల్లెలు, సెమీ అర్బన్‌ (చిన్న పట్టణాలు) ప్రాంతాల్లోనూ వీటికి డిమాండ్‌ పుంజుకుందని ఆటో మొబైల్‌ సంస్థలు చెబుతున్నాయి. గేర్లు లేకపోవడం, ఎవరైనా నడిపేందుకు అనుకూలంగా ఉండటం, బైక్‌ ధరకే స్కూటర్‌ కూడా వస్తుండడం, ఆర్జించే మహిళలు పెరుగుతుండడం వెరసి స్కూటర్ల మార్కెట్‌ వేగం పుంజుకుంటోంది.

హోండా... ప్రతి ఏడింట్లో మూడు
స్కూటర్‌ విక్రయాల్లో పరిశ్రమలోనే నంబర్‌ 1 స్థానంలో ఉన్న హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాను విక్రయించే ప్రతి 7 మోటారు సైకిళ్లకు గ్రామీణ, సెబీ అర్బన్‌ ప్రాంతాల్లో 3 స్కూటర్లుంటున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ మార్కెట్లలో ప్రతి 9 బైకులకు ఒక్క స్కూటరే అమ్ముడయ్యేది.

స్కూటర్ల విక్రయాలు వేగాన్ని అందుకున్నాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల విక్రయాల్లో (ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు) స్కూటర్ల విక్రయాలు 18.5 శాతం అధికంగా నమోదైతే, ఇదే కాలంలో బైకుల విక్రయాల వృద్ధి 11.5 శాతంగానే ఉంది. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోటారు బైకుల మార్కెట్‌ స్కూటర్లకు మళ్లిపోతోంది. 100–110సీసీ బైకుల వినియోగదారులు స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బైకులు, స్కూటర్ల మధ్య మార్కెట్‌ వాటా పరంగా ఉన్న అంతరం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రారంభ స్థాయి మార్కెట్‌కు గండి
2017 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు చూస్తే మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో స్కూటర్ల వాటా 33.7 శాతంగా ఉంది. 100–110సీసీ బైకుల వాటా 36.5 శాతం. ఈ రెండింటి మధ్య అంతరం 2.8 శాతానికి తగ్గిపోయింది. ఏడేళ్ల క్రితం ఈ రెండింటి మధ్య అమ్మకాల్లో వ్యత్యాసం 28–30 శాతం స్థాయిలో ఉన్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం.

స్కూటర్ల మార్కెట్లో లీడర్‌గా ఉన్న హోండా ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఆ అవకాశాలను సొంతం చేసుకునేందుకు అవసరమైన విధానాలను ఆచరణలో పెట్టింది. 2017లో గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా క్లిక్‌ పేరుతో ఓ స్కూటర్‌ను కూడా హోండా ప్రవేశపెట్టింది. అంతేకాదు, 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రారంభమైన కొత్త సబ్‌ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌లో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడం కంపెనీ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

హోండాకు గ్రామీణ ప్రాంతాల్లో వాటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఐదేళ్ల క్రితం ఈ వృద్ధి రేటు ఒక్క అంకె స్థాయిలోనే ఉంది. పట్టణ, నగర మార్కెట్లో మాత్రం హోండా వేగంగా 25 శాతం చొప్పన వృద్ధిని నమోదు చేస్తోంది. టీవీఎస్‌ ద్విచక్ర వాహన విక్రయాల్లో స్కూటర్ల వాటా 38 శాతంగా ఉంటే, సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా విక్రయాల్లో 84 శాతం స్కూటర్లే కావడం గమనార్హం.

నడపడంలో వెసులుబాటు
110సీసీ సామర్థ్యం కలిగిన హోండా క్లిక్‌ స్కూటర్‌ ఇప్పటి వరకు 12,000 యూనిట్లు అమ్ముడుపోయి ఉండొచ్చని అంచనా. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.42,000 స్థాయిలో ఉంది. దీని టైర్లు అదనపు గ్రిప్‌తో, గతుకుల రోడ్లలోనూ మరింత నియంత్రణకు, గ్రామీణ రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. ‘‘మరింత మంది మహిళలు గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల నుంచి పనుల్లో చేరుతుండటంతో వాహనాలకు డిమాండ్‌ పెరిగింది’’ అని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వైఎస్‌ గులేరియా తెలిపారు.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది రెండు వాహనాలను (పురుషులకు బైక్, స్త్రీలకు స్కూటర్‌) భరించలేరని, దీంతో స్కూటర్‌ వారి ఎంపికగా ఉంటోందని చెప్పారాయన. గతంలో ఆటోమేటిక్‌ స్కూటర్‌ (రూ.48,000)కు 100–110 సీసీ బైక్‌కు (రూ.44,000) మధ్య ధరల పరంగా వ్యత్యాసం ఉండడంతో స్కూటర్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారు కాదని, దీన్ని తాము గుర్తించి రూ.42,000 స్థాయిలో క్లిక్‌ స్కూటర్‌ను తీసుకొచ్చినట్టు గులేరియా తెలిపారు.


భవిష్యత్‌లో మరిన్ని వృద్ధి అవకాశాలు
టైర్‌–3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనుంచి మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతుండడంతో స్కూటర్ల వృద్ధికి అవకాశాలు ఏర్పడినట్టు యమహా మోటార్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాయ్‌కురియన్‌ చెప్పారు.

2020 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌–6 కాలుష్య ప్రమాణాలు 100–110సీసీ బైక్‌ మార్కెట్‌కు మరింత విఘాతం కలిగిస్తుందన్నారు. దీన్నుంచి స్కూటర్‌ మార్కెట్‌ లబ్ది పొందుతుందని, ధరల పరంగా మరింత పోటీగా మారడం, గేర్లు లేకపోవడం ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు.  ముఖ్యంగా అధిక మైలేజీనిచ్చే 100 సీసీ స్కూటర్లకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు