అతుకులులేని రాగి బాటిల్

8 Dec, 2015 02:07 IST|Sakshi
అతుకులులేని రాగి బాటిల్

ప్రపంచంలో తొలిసారిగా తయారీ
 రూ.50 కోట్లతో ప్లాంటు ఏర్పాటు
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
అతుకులు లేని (సీమ్‌లెస్) రాగి బాటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఆర్ ఇండియా రూపొం దించింది. ఎటువంటి అతుకులు లేకుండా బాటిల్‌ను తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. ‘డాక్టర్ కాపర్’ బ్రాండ్‌తో కంపెనీ వీటిని మార్కెట్ చేస్తోంది. పైలట్ కింద చేపట్టిన విక్రయాలు విజయవంతమయ్యాయని, ఇప్పటికే 25,000 బాటిళ్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఎంఎస్‌ఆర్ ఇండియా సీఎండీ ఎం.శ్రీనివాస రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకునే సౌకర్యవంతంగా ఉండేలా 100% స్వచ్ఛమైన రాగితో బాటిళ్లను రూపొందించాం. లీటరు బాటిల్ ధర రూ.600గా నిర్ణయించాం’ అని చెప్పారు.
 
 ఏడాదిలో ప్లాంటు విస్తరణ..
 ప్రస్తుతం కంపెనీ నెలకు 3.5 లక్షల యూనిట్లు తయారు చేయగల ప్లాంటును జీడిమెట్ల వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టింది. మెషినరీని యూరప్ నుంచి దిగుమతి చేసుకున్నామని శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాటిల్ పరిశ్రమ మార్కెట్ దేశంలో రూ.8,000 కోట్లుంది. 2020 నాటికి ఇది రూ.20 వేల కోట్లకు చేరుతుంది. మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉండడంతో ఏడాదిలో ప్లాంటును విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. రోజుకు 50,000 బాటిళ్లు తయారు చేయగల మెషినరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఈ మెషినరీకి రూ.100 కోట్ల దాకా వ్యయం అవుతుందని వెల్లడించారు. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటితో నింపిన బాటిళ్లను పలు రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.


 ఎఫ్‌ఎంసీజీలోకి సైతం..
 బీఎస్‌ఈలో లిస్ట్ అయిన ఎంఎస్‌ఆర్ ఇండియా త్వరలో ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌లోని బౌరంపేట వద్ద 10 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నిర్మాణ పనులను కంపెనీ వేగిరం చేసింది. ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు ఇక్కడ తయారు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఇవి మార్కెట్లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ప్లాంటు కోసం రూ.25 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు