పెట్టుబడికి రేటింగ్‌ చూస్తారా?

10 Dec, 2018 02:54 IST|Sakshi

పలు అంశాలు చూశాకే ఏజెన్సీల రేటింగ్‌

అవి... యాజమాన్య బలాలు, సమర్థత

వ్యాపార పరంగా తీసుకునే రిస్క్‌ 

తీసుకున్న రుణాలను చెల్లించే సామర్థ్యం

తాజాగా లిక్విడిటీ అంశాలు కూడా

సినిమా చూసేముందు ఆ సినిమాకు రేటింగ్‌ ఎంతనేది చూస్తారు కొందరు!   కొందరైతే రెస్టారెంట్లకు వెళ్లేటపుడు కూడా దాని రేటింగ్, దానిపై ఇతరుల రివ్యూలు చూస్తారు! ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రేటింగ్‌లు, రివ్యూలు చూసినపుడు... మరి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటపుడు ఇలాంటివి చూడొద్దా..? అసలు ఆ పెట్టుబడిలో రిస్కు ఎంత? రాబడి ఎంత? దాని గురించి, దాన్ని జారీ చేస్తున్నవారు చెప్పే మాటల్లో నిజమెంత? ఇవన్నీ చెప్పేది రేటింగ్‌ ఏజెన్సీలే. అన్ని అంశాలూ చూసి... వాటిలో పెట్టుబడి పెట్టవచ్చో, లేదో అవే చెబుతాయి. అంటే... అవి ఇచ్చే రేటింగ్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలో, పెట్టకూడదో మనమే నిర్ణయం తీసుకోవచ్చు.  

నిజానికి అందరూ కాకున్నా చాలా మంది మాత్రం పెట్టుబడులు పెట్టే ముందు సదరు ఆర్థిక సాధనానికి ఏ రేటింగ్‌ ఉందన్నది చూస్తారు. కాకపోతే, వీరిలో కూడా అత్యధికులు ఏ అంశాల ఆధారంగా రేటింగ్‌ సంస్థలు ఓ సాధనానికి రేటింగ్‌ ఇస్తాయనేది పట్టించుకోరు. ఫైనాన్షియల్‌ కంపెనీల ఉత్పత్తులకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు పలు రకాల రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా కంపెనీల రిస్క్‌ అంశాలను మదింపు చేసిన అనంతరం ఆయా కంపెనీల బాండ్లు, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీలు లేదా డెట్‌ ఇనుస్ట్రుమెంట్ల రేటింగ్‌తో పాటు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిటైల్‌ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెస్తాయి. దీంతో ఇవి తమకు నప్పుతాయా, లేదా అన్నది ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు.  

రేటింగ్‌ అంశాల్లోకి సెబీ ఇటీవలే లిక్విడిటీని కూడా జోడించింది. దీంతో కంపెనీ నగదు బ్యాలన్స్, లిక్విడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (సత్వరం నగదుగా మార్చుకునే పెట్టుబడులు), లిక్విడిటీ కవరేజీ రేషియో, గడువు తీరే రుణాలకు చేయాల్సిన చెల్లింపులకు సరిపడా నగదు ప్రవాహాల వివరాలను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్‌ చేస్తున్న కంపెనీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు ఉపకరించేవే. ఓ కంపెనీ ప్రొఫైల్‌ను విశ్లేషించే విషయంలో క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం...
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

ఫైనాన్షియల్‌ రిస్క్‌
ఓ కంపెనీ నగదు ప్రవాహాల అందుబాటు, నిలకడ, రుణాలను సమయానుకూలంగా చెల్లించేయడం వంటి అంశాలు ఫైనాన్షియల్‌ రిస్క్‌లో భాగం. ఇందులో భాగంగా కంపెనీ వ్యాపార బలా, బలాలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ బలాల ఆధారంగా ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యంగా ఉంటే, నిధుల లభ్యత ఉంటే, సంబంధిత కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది సంకేతం.  

వ్యాపార రిస్క్‌
నగదుకు కొరత ఏర్పడిన సందర్భాల్లో... ఓ కంపెనీ బలాన్ని అర్థం చేసుకునేందుకు ఆ కంపెనీ నగదు ప్రవాహాల నిలకడ, స్థిరత్వం అన్న అంశాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ‘‘కంపెనీ వ్యాపార మూలాలను విశ్లేషించడం, నిర్వహణ సామర్థ్యాలు, ఆ రంగంలో కంపెనీ స్థానం, సంబంధిత రంగానికి ఉన్న సానుకూలతలను విశ్లేషించడం జరుగుతుంది. ఆ రంగం తీవ్రమైన పతనంలో ఉంటే లేదా కంపెనీ ఫండమెంటల్స్‌లో లేదా మార్కెట్‌ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటే రేటింగ్‌పై ప్రతిఫలిస్తాయి’’ అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలిపారు.  

యాజమాన్య రిస్క్‌
యాజమాన్య పరంగా రిస్క్‌ అంశాలను కూడా రేటింగ్‌ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. యాజమాన్యం అనుసరించే విధానాలు, వ్యాపారంలో తీసుకునే రిస్క్, వ్యూహాలను పరిశీలిస్తాయి. అలాగే, కంపెనీని నడిపించే యాజమాన్యానికి ఉన్న అనుభవం, ట్రాక్‌రికార్డ్‌ (గత చరిత్ర)ను కూడా చూస్తాయి. యాజమాన్యం అధిక రిస్క్‌ తీసుకునే తరహా అయితే... రుణాలు ఎక్కువగా తీసుకోవడం లేదా ప్రస్తుత కార్యకలాపాలను మించి ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. దీంతో రేటింగ్‌ ఏజెన్సీలు వీటిని సానుకూలంగా చూడవు. అందుకే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సెక్యూరిటీలు, డిబెంచర్లు, డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టే ముందు యాజమాన్య రిస్క్‌ను తప్పకుండా చూడాలి.

ప్రాజెక్టు రిస్క్‌
ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టులో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు, ఆ ప్రాజెక్టు తుది రూపం, అందులో ఉన్న లాభాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్స్‌ (ఐడీఎఫ్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం ఇటువంటిదే. ఈ తరహా వాటిల్లో పెట్టుబడికి రిస్క్‌ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిధులు సమీకరించడం సాధారణమే అవుతుంది. అందుకే, ఓ కంపెనీ నూతన ప్రాజెక్టులకు సంబంధించిన రిస్క్‌ను కూడా రేటింగ్‌ సంస్థలు చూసి రేటింగ్‌ ఇస్తుంటాయి.

ఎగవేత అవకాశాలు
అన్నింటికంటే ముఖ్యమైనది ఓ కంపెనీ డిఫాల్ట్‌ రిస్క్‌. ఎందుకంటే ఇది కంపెనీ ప్రొఫైల్‌పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఈ విభాగంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. రుణదాతలు, ఆర్థిక సంస్థలు, ఇన్వెస్టర్లకు ఈ డిఫాల్ట్‌ రిస్క్‌ ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే ఓ కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆ కంపెనీకి అప్పటికే ఉన్న రుణ భారం, ఆ కంపెనీ పెట్టుబడులు వంటివి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు అవసరం.

ఏ రేటింగ్‌ అయితే బెటర్‌?
క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గితే...?  
క్రెడిట్‌ రేటింగ్‌ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్‌ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి క్రెడిట్‌ రేటింగ్‌ చాలా ముఖ్యమైన పారామీటర్‌. కంపెనీల ఐపీవోలకు కూడా ఈ రేటింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్‌లను తగ్గించిన విషయం తెలిసిందే. చాలా వరకు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీసే అంశమే. అయితే, ఓ కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఆమ్టెక్‌ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడం జరిగింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రేటింగ్‌లను కూడా తగ్గించడంతో ఆ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

క్రెడిట్‌ రేటింగ్‌ అంటే...?
ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్‌ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్‌ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్‌ రేటింగ్‌. కేర్‌ రేటింగ్స్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తుంటాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం అంటే అర్థం... డిపాజిట్లు, ఎన్‌సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి సన్నగిల్లినట్టు. ఇదే జరిగితే రుణదాతలు తాజాగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఏ రేటింగ్‌ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగటివ్‌ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్‌ నుంచి నెగటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్‌ అనేవి అధిక రేటింగ్‌ సూచికలు. ఈ రేటింగ్‌ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతతో కూడినది. ఇంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న వాటిలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే కచ్చితంగా మరింత రిస్క్‌ను స్వీకరిస్తున్నట్టుగానే భావించాలి. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్‌ రేటింగ్‌ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించి అయినా ముందుగానే వైదొలగడం సురక్షితం.

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారు
రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తే ఆయా ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఎన్‌ఏవీలు క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పథకం ఎంత మేర పెట్టుబడులను కలిగి ఉందన్న దానిపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఎక్స్‌పోజర్‌ కలిగి ఉంటే ఈ నష్టం మరింత అధికంగా ఉంటుంది. ఆగస్ట్‌ చివరి నాటి గణాంకాల ప్రకారం 40 డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా. అసలు ఈ రేటింగ్‌ ఏం చెబుతుంది? ఏ రేటింగ్‌ ఉంటే మన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది? ఏ రేటింగ్‌ ఉంటే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది? ఇందులో డెట్‌ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈక్విటీ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చూద్దాం...

దీర్ఘకాలిక డెట్‌ సాధనాలకైతే...
► ఏఏఏ చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహించడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్‌ తెలియజేస్తుంది. దీన్లో పెట్టుబడులకు అతి తక్కువ రిస్క్‌ ఉన్నట్లు లెక్క.
► ఏఏ ఈ రేటింగ్‌ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌నే సూచిస్తుంది.
► ఏ సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్‌ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ.  
► బీబీబీ తీసుకున్న డిపాజిట్లు, రుణాల తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్‌ అర్థం. మోస్తరు రిస్క్‌ ఉంటుంది.
► బీబీ తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్‌ రిస్క్‌ ఉంటుందని ఈ రేటింగ్‌ తెలియజేస్తుంది.  
► బీ ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్‌ రిస్క్‌ అధికంగా ఉంటుంది.
► సీ ఈ రేటింగ్‌ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక అవకాశాలుంటాయి. అంటే రిస్క్‌ చాలా ఎక్కువ.
► డీ డిఫాల్ట్‌ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్‌ అవనున్నట్టు ఈ రేటింగ్‌ తెలియజేస్తుంది.

షార్ట్‌ టర్మ్‌ డెట్‌ సాధనాలకు రేటింగ్‌
► ఏ1 క్రెడిట్‌ రిస్క్‌ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది.  
► ఏ2 తక్కువ క్రెడిట్‌ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
► ఏ3 మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్‌ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్‌ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.
► ఏ4 భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్‌ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్‌ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది.
► డీ ఈ రేటింగ్‌ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్‌ లేదా డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్‌ ఇవ్వడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు