డెక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌పై సెబీ నిషేధం

1 Jan, 2020 08:31 IST|Sakshi

 సాక్షి, ముంబై: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) ప్రమోటర్లపై మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ కొరడా ఝుళిపించింది. సెక్యూరిటీల మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించకుండా డెక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌ టి. వెంకట్రామ్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ టి. వినాయక్‌ రవి రెడ్డి, పరుశురామన్‌ కార్తీక్‌ అయ్యర్, ఎమ్‌డీ, ఎన్‌. కృష్ణన్‌లపై రెండేళ్లపాటు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఈ మేరకు సెబీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీ బీ మౌలీ అండ్‌ అసోసియేట్స్‌ భాగస్వామి మణి ఊమెన్‌పై ఏడాదిపాటు నిషేధం వేసింది. ఒక సంవత్సరం పాటు ఏ లిస్టెడ్ కంపెనీకి సెక్రటేరియల్ సేవలను అందించవద్దని  కంపెనీ సెక్రటరీ శంకర్‌ను ఆదేశించింది. తగినన్ని నిల్వలు లేకుండానే  షేర్ల బై బ్యాక్‌ ఆఫర్‌ను  ప్రకటించిందని రెగ్యులేటరీ వెల్లడించింది. 

తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలపై గతంలోనే సీబీఐ  కేసులు నమోదు చేసింది. కాగా గత ఏడాది ఆగస్టులో బ్యాంకు మోసానికి సంబంధించి కంపెనీ కార్యాలయాలు, ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది.  2017 లో రూ .217 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.  బెంగళూరు, కేరళ డెక్కన్ క్రానికల్ ఎడిషన్లను  ఇటీవల మూసివేసింది.

మరిన్ని వార్తలు