డీఎల్‌ఎఫ్‌పై సెబీ మూడేళ్ల నిషేధం

14 Oct, 2014 00:49 IST|Sakshi
డీఎల్‌ఎఫ్‌పై సెబీ మూడేళ్ల నిషేధం

ప్రమోటర్ కేపీ సింగ్,టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా
* స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు చెక్
* ఐపీవోలో తప్పుడు సమాచార ఫలితం
ముంబై:
రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌తోపాటు, ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్ తదితర ఆరుగురు అత్యున్నత అధికారులపై నిషేధం వేటు పడింది. మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీలులేకుండా నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ఆఫర్ సమయంలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా కంపెనీ అవకతవకల సమాచారాన్ని ప్రకటించడమే దీనికి కారణమని సెబీ జీవితకాల సభ్యులు రాజీవ్ అగర్వాల్ తెలిపారు.

నిషేధానికి గురైన ఎగ్జిక్యూటివ్‌లలో కేపీ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్(డీఎల్‌ఎఫ్ వైస్‌చైర్మన్), కుమార్తె పియా సింగ్ (హోల్‌టైమ్ డెరైక్టర్) సహా టీసీ గోయల్(ఎండీ), కామేశ్వర్ స్వరూప్(అప్పటి సీఎఫ్‌వో), రమేష్ శంకా(అప్పటి ఈడీ, లీగల్) సైతం ఉన్నారు. సెబీ నిషేధంవల్ల వాటాల విక్రయం, కొనుగోలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండదు. ప్రమోటర్లకు కంపెనీలో దాదాపు 75% వాటా ఉంది.

నిబంధనల ఉల్లంఘన...: వివరాల వెల్లడి, ఇన్వెస్టర్ల రక్షణ(డీఐపీ) మార్గదర్శకాలతోపాటు, మోసం, అవకతవకల కార్యకలాపాల నిరోధం(పీఎఫ్‌యూటీపీ) వంటి సెబీ నిబంధనలను డీఎల్‌ఎఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉల్లంఘించారని రాజీవ్ పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన నిబంధనల ఉల్లంఘన వల్ల సెక్యూరిటీల మార్కెట్ రక్షణ, విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కిమ్సుక్ కృష్ణ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు,  సెబీకి సైతం కంపెనీపై ఫిర్యాదు చేయడంతో 2010లో సెబీ డీఎల్‌ఎఫ్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది.
 
2007లో పబ్లిక్ ఇష్యూ
పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ వద్ద డీఎల్‌ఎఫ్ 2007 జనవరిలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఆపై 2007 మే నెలలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 9,187 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేం జీలలో జూలై 2007లో లిస్టయ్యింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేరు 3.7% పతనమై రూ. 147 వద్ద ముగిసింది. సెబీ నుంచి నోటీస్ అందుకున్నామని, ఈ అంశాన్ని న్యాయ సలహాదారులతో సమీక్షిస్తున్నామని డీఎల్‌ఎఫ్ బీఎస్‌ఈకి తెలిపింది. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు