క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌పై నిషేధం లేదు: కార్వీ

24 Nov, 2019 05:08 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త క్లయింట్లను తీసుకోవటంపై మాత్రమే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 21 రోజుల పాటు నిషేధం విధించిందని, ప్రస్తుత క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌ చేయటం, మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించటం వంటి అంశాల్లో ఎలాంటి నిషేధం లేదంటూ ఆర్థికసేవల సంస్థ ‘కార్వీ’ శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘మా వ్యాపారాల్లో సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నియంత్రణలో నడిచే స్టాక్‌ బ్రోకింగ్‌ కూడా ఒకటి. దీని పనితీరు, బుక్స్‌ను ఈ సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాయి.

ఆగస్టులో జరిగిన తనిఖీకి సంబంధించి సెబీకి ఎన్‌ఎస్‌ఈ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా 22న సెబీ తాత్కాలిక ఎక్స్‌పార్టీ ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్పందించాలని మాకు 21 రోజుల సమయం ఇచ్చింది. అప్పటిదాకా కొత్త క్లయింట్లను తీసుకోరాదని నిషేధించింది. ప్రస్తుత క్లయింట్ల తరఫున కార్యకలాపాలు సాగించటంపై మాత్రం ఎలాంటి నిషేధమూ లేదు’ అని సంస్థ వివరించింది. సంస్థ స్పందించిన అనంతరం దీనిపై మరింత సమగ్రంగా దర్యాప్తు జరిపి తాజా ఉత్తర్వుల్ని సమీక్షిస్తామని సెబీ తెలియజేసినట్లు కార్వీ పేర్కొంది.

మరిన్ని వార్తలు