సెబీ కేసులో కోర్టు ముందుకు రామలింగరాజు

14 Nov, 2014 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మదుపుదారులను మోసం చేశారంటూ స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు గురువారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబ సభ్యులు రామరాజు, ఝాన్సీరాణి, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, మాజీ వీపీ (ఫైనాన్స్) జి.రామకృష్ణ, ఆడిటింగ్ విభాగం హెడ్ వీఎస్ ప్రభాకర్‌గుప్తా, మాజీ డెరైక్టర్, టీవీ-9 అధినేత చింతలపాటి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీని రాజు తదితరులు హాజరయ్యారు.

 వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్...రూ.20 వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ, ఆడిటర్ తళ్లూరి శ్రీనివాస్‌లకు సమన్లు అందకపోవడంతో వారు కోర్టుకు హాజరుకాలేదు. ఇదిలా ఉండగా ఇదే కేసులో శ్రీని రాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ (మైటాస్ ఇన్‌ఫ్రా), సూర్యనారాయణ రాజుకు చెందిన ఎస్‌ఆర్ ఎస్‌ఆర్ హోల్డింగ్స్‌లు కూడా నిందితుల జాబితాలో ఉండగా ఆ సంస్థల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు