మ్యూచువల్‌ ఫండ్స్‌ మరింత చౌక

20 Sep, 2018 00:52 IST|Sakshi

ఏఎంసీల మార్జిన్లపై ప్రభావం 

డిస్ట్రిబ్యూటర్ల కమీషన్లు తగ్గే అవకాశం 

సెబీ నిర్ణయంపై నిపుణుల విశ్లేషణ 

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లపై అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లు విధించే చార్జీలకు సెబీ కత్తెర వేయడంతో... మ్యూచువల్‌ ఫండ్స్‌ మరింత చౌకగా మారతాయని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొన్నారు. అదే సమయంలో ఏఎంసీల మార్జిన్లపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల నిర్వహణకు గాను ఏఎంసీలు ఏటా చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ చార్జీలను ప్రతీరోజూ ఎన్‌ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. ఈ వ్యయాలన్నింటితో కూడిన టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో(టీఈఆర్‌)ను క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాలపై గరిష్టంగా 1.25 శాతం, ఇతర క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల(ఈక్విటీ కాకుండా)పై 1 శాతానికి సెబీ పరిమితి విధించింది. అలాగే, ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాలపై గరిష్టంగా 2.25 శాతం, ఇతర ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలపై 2 శాతం చేసింది.  

పెరగనున్న కొనుగోళ్లు  
‘‘టీఈఆర్‌ దిగొచ్చింది. ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల శ్లాబులు కూడా మారాయి. ఇది కచ్చితంగా ఇన్వెస్టర్లకు మేలు చేసేదే. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల వ్యయాలు దిగొస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మరింత పారదర్శకత నెలకొంటుంది’’ అని క్వాంటమ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో జిమ్మీ పటేల్‌ తెలిపారు. పథకాలు మరింత పెద్దవిగా ఉండాలన్న సూత్రాన్ని ఎక్స్‌పెన్స్‌ రేషియో సమీక్ష తెలియజేస్తోందని యూనియన్‌ ఏఎంసీ సీఈవో జి.ప్రదీప్‌కుమార్‌ అన్నారు. అయితే, ఈక్విటీ, బ్యాలన్స్‌డ్‌ విభాగంలో పెద్ద పథకాల మార్జిన్లపై ఇది ప్రభావం చూపుతుందన్న ఆయన, దీనివల్ల కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్న పథకాలపై ఈ ప్రభావం పరిమితమేనన్నారు. టీఈఆర్‌ తగ్గింపుతో ఏఎంసీలు డిస్ట్రిబ్యూటర్లకు చేసే కమీషన్ల చెల్లింపులు 0.15–0.20% వరకు తగ్గుతాయని నివేష్‌ డాట్‌ కామ్‌ సీఈవో అనురాగ్‌ గార్గ్‌ పేర్కొన్నారు.  

మరీ తగ్గకూడదు...: ‘‘వ్యయాలు తగ్గుముఖం పడితే ఫండ్స్‌పై నికర రాబడులు పెరుగుతాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారతాయి. అయితే, వ్యయాలు మరింత తగ్గకుండా చూడాల్సి ఉంది. ఎందుకంటే పరిశ్రమ నాణ్యమైన మానవ వనరులను ఆకర్షించేందుకు మంచి వేతన చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని షేర్‌ఖాన్‌ బీఎన్‌పీ పారిబాస్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ గ్రోనింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 1999లో రూ.79,501 కోట్ల ఆస్తుల నిర్వహణతో ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ, 2018 ఆగస్ట్‌ నాటికి రూ.25.20 లక్షల కోట్ల స్థాయికి విస్తరించింది.   


 

మరిన్ని వార్తలు