షేర్ల దుర్వినియోగానికి చెక్‌

14 Feb, 2020 06:20 IST|Sakshi

ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందించిన సెబీ

న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్‌ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్‌ ఎక్సే్చంజీలను ఈ సిస్టమ్‌ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది.

ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్‌ ఎక్సే్చంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్‌లైన్‌ సిస్టమ్‌ సేకరిస్తుంది. క్లయింట్‌ డీమ్యాట్‌ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్సే్చంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్సే్చంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు