మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు తగ్గాయ్‌

9 Jan, 2020 05:22 IST|Sakshi

గతనెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ; 2 శాతం తగ్గుదల

రూ.26.54 లక్షల కోట్లకు ఏయూఎం

డెట్‌ పథకాల్లో భారీగా విక్రయాలు

న్యూఢిల్లీ: డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2% తగ్గి రూ. 26.54 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యలతో గతేడాది నవంబర్‌ నెల్లో మొత్తం నిర్వహణ ఆస్తి గరిష్టంగా రూ. 27.04 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే.

కాగా, ఆ సమయంలో భారీగా ఇన్‌ఫ్లో పెరిగిన రుణ–ఆధారిత పథకాల్లోనే గత నెల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ స్కీముల్లోని లిక్విడ్‌ ఫండ్స్, నగదు విభాగాల్లోని ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్స్, కమర్షియల్‌ పేపర్లు వంటి స్వల్పకాలిక సాధనాల నుంచి రూ. 71,000 కోట్ల మేర ఉపసంహరణ చోటుచేసుకుంది. వీటితో పాటు ఒక రోజులో మెచ్యూర్‌ అయ్యే ఓవర్‌ నైట్‌ ఫండ్స్‌లో రూ. 8,800 కోట్లు వెనక్కువెళ్లాయి. అయితే, అధిక రేటింగ్‌ కలిగిన బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్‌లో రూ. 4,770 కోట్లు చేరాయి.  గత నెల్లో అమ్మకాల వెల్లువకు కారణం రుణ–ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలే అని పైసా బజార్‌ డాట్‌ కామ్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ నవీన్‌ కుక్రేజా విశ్లేషించారు.  

ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో జోరు..
గత నెలలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలను తిరగరాసుకుంటూ దూసుకెళ్లిన నేపథ్యంలో ఈక్విటీ ఓరియంటెడ్‌ ఫండ్స్‌ రూ. 4,432 కోట్ల ఇన్‌ఫ్లోను ఆకర్షించాయి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు నిరాశాజనకంగా ఉండడంతో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి ప్రవాహం పెరిగిందని కుక్రేజా విశ్లేషించారు.  

సిప్‌ సూపర్‌..
డిసెంబర్‌లో క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల(సిప్‌) ద్వారా చేరిన పెట్టుబడులు రూ. 8,518 కోట్లు కాగా, దీంతో సిప్‌ అసెట్‌ బేస్‌ ఏకంగా జీవితకాల గరిష్టానికి చేరింది. గతనెల చివరినాటికి అసెట్‌ బేస్‌ రూ. 3.17 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్‌ ఇన్వెస్టర్లలో  ఫండ్స్‌పై విశ్వాసం పెరిగినందున సిప్‌ పెట్టుబడులు జోరందుకుంటున్నాయని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌.ఎస్‌.వెంకటేష్‌ అన్నారు. గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ రూ. 27 కోట్లను ఆకర్షించాయి.

మరిన్ని వార్తలు