రిలయన్స్‌కు సెబీ రూ.13 కోట్ల జరిమానా

9 Aug, 2014 02:22 IST|Sakshi
రిలయన్స్‌కు సెబీ రూ.13 కోట్ల జరిమానా

 ముంబై: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు నియంత్రణ సంస్థ సెబీ రూ.13 కోట్ల జరిమానా విధించింది. ఏడేళ్ల క్రితం నాటి స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘన కేసులో శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇందులో రూ. 1 కోటి మొత్తాన్ని లిస్టింగ్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినందుకు.. మిగతా రూ.12 కోట్లను సెక్యూరిటీస్ కాంట్రాక్టుల(నియంత్రణ) చట్టంలోని నిబంధనలను పాటించనందుకు జరిమానాగా విధిస్తున్నట్లు పేర్కొంది. ఇక కేసు విషయానికొస్తే.. ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఆర్‌ఐఎల్ 2007లో తమ ప్రమోటర్లకు 12 కోట్ల వారెంట్లను జారీ చేసింది.

ఇంతే మొత్తంలో ఈక్విటీ షేర్ల కింద మార్పు చేసేందుకు వీలుగా వారెంట్ల ఇష్యూ జరిగింది. దీనివల్ల కంపెనీ మొత్తం ప్రీ-ఇష్యూ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరిగేందుకు(డైలూషన్) దారి తీసింది. ఈ షేర్ల జారీ కారణంగా షేరువారీ ఆర్జన(డీఈపీఎస్) తగ్గుదల వివరాలను ఆరు క్వార్టర్లపాటు, వార్షిక ఫలితాల్లో కూడా ఆర్‌ఐఎల్ వెల్లడించలేదనేది సెబీ ప్రధాన ఆరోపణ. కంపెనీ షేర్లను కొనుగోలు చేసే లేదా విక్రయించే ఇన్వెస్టర్లపై ఈ సమాచారం చాలా ప్రభావం చూపుతుందని.. అయినా కంపెనీ దీన్ని చాన్నాళ్లపాటు చెప్పలేదని సెబీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం సెబీ ఆదేశాలను పరిశీలిస్తున్నామని, న్యాయ సలహాలకు అనుగుణంగా తగిన చర్యలను చేపడతామని ఆర్‌ఐఎల్ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు