చిన్ననగరాలపై చిన్న చూపు వద్దు

27 Jun, 2013 05:43 IST|Sakshi
mutual fund

ముంబై: చిన్న నగరాల మదుపరులపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్ కంపెనీలను సెబీ చైర్మన్ యు.కె. సిన్హా  బుధవారం ఆదేశించారు.  ఈ రంగంలో దీర్ఘకాల వృద్ధికి కంపెనీలు కట్టుబడి ఉండాలని సూచించారు. అగ్రశ్రేణి 15 నగరాల్లో కాకుండా ఇతర చిన్న నగరాల్లో  కార్యకలాపాలు నిర్వహించడానికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల(ఏఎంసీ)కు కొన్ని ప్రోత్సాహకాలిచ్చామని పేర్కొన్నారు. కానీ కొన్ని ఏఎంసీలు అందుకు తగ్గట్లుగా పనిచేయడంలేదని చెప్పారు. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిఐఐ ఇక్కడ నిర్వహించిన మ్యూచువల్ ఫండ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 మ్యూచువల్ ఫండ్ పరిశ్రమపై దీర్ఘకాలిక విధానం కోసం ఒక కమిటీని నియమించామని, ఆ కమిటీ 2-3 నెలల్లో తన నివేదికను అందిస్తుందని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 48 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీటిల్లో 38 కంపెనీలు అగ్రశ్రేణి 15 నగరాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయని వివరించారు. ఈ 48 సంస్థల మొత్తం బ్రాంచీల సంఖ్య 1,600 మాత్రమేనని చెప్పారు. మొత్తం మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం వాటా టాప్ 10 కంపెనీలదేనని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థల రిటైల్ కార్యకలాపాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో 28 శాతంగా ఉన్న ఎంఎఫ్‌ల రిటైల్ వాటా 2012లో 27 శాతానికి, 2013లో ఇప్పటివరకూ 23 శాతానికి తగ్గిందన్నారు. మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొన్ని కంపెనీలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అర్థం అవుతోందని పేర్కొన్నారు. నియమ నిబంధనలన్నింటిని పాటిస్తున్న సంస్థలకు నజరానాలుంటాయని చెప్పారు.
 
 ఫండ్స్ పనితీరు తెలిపే క్రిసిల్ ఇండెక్స్‌లు
 రేటింగ్ దిగ్గజం క్రిసిల్ వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పనితీరును తెలిపేందుకు వీలుగా సూచీలను ప్రవేశపెట్టింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(ఏఎంఎఫ్‌ఐ-యాంఫీ) సహకారంతో వివిధ సూచీలను రూపొందించింది. ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, డెట్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ పనితీరును ప్రతిబింబించేందుకు విడిగా ఇండెక్స్‌లను ప్రవేశపెట్టింది.  పారదర్శకంగా పనిచేసే ఈ ఇండెక్స్‌లు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడతాయని వివరించింది. 

మరిన్ని వార్తలు