డిఫాల్ట్‌ నిబంధనలు మరింత కఠినం

21 Nov, 2019 05:47 IST|Sakshi

రైట్స్‌ ఇష్యూ కాలం కుదింపు 

పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు 

సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడి

ముంబై: రుణ చెల్లింపుల్లో వైఫల్యానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్‌ నియం త్రణ సంస్థ సెబీ కఠినతరం చేసింది. రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌  స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెబీ బోర్డ్‌ బుధవారం తీసుకున్న నిర్ణయాల వివరాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. వివరాలు....

డిఫాల్ట్‌ 30 రోజులకు మించితే....
స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఏదైనా కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమై 30 రోజులు దాటితే, 24 గంటల్లోనే ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు వెల్లడించాల్సి ఉంటుంది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు సంబంధించిన సమాచారం వాటాదారులకు, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడం కోసమే సెబీ  ఈ నిబంధనను తెచ్చింది. ఈ కొత్త వెల్లడి నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.  

రైట్స్‌ ఇష్యూ కాలం 31 రోజులకు కుదింపు....
రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని సెబీ తగ్గించింది. ఈ ప్రక్రియ గతంలో 55 రోజుల్లో పూర్తయ్యేది. దీనిని 31 రోజులకు తగ్గించింది. అలాగే రైట్స్‌ ఇష్యూకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల ఇన్వెస్టర్లు ఆస్బా (అప్లికేషన్స్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్‌డ్‌ అమౌంట్‌)విధానంలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.

పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు..
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌) నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్లను దూరం చేయడమే లక్ష్యంగా పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పరిమితిని సెబీ పెంచింది. గతంలో రూ.25 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.50 లక్షలకు పెంచింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ నెట్‌వర్త్‌ను చేరుకోవడానికి పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు మూడేళ్ల గడువును ఇచ్చింది. ఈ తాజా నిబంధనల కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెరుగుతాయని నిపుణుల అంచనా.  

వ్యాపార బాధ్యత నివేదిక...
మార్కెట్లో లిస్టైన టాప్‌ 1,000 కంపెనీలు వార్షిక వ్యాపార బాధ్యత నివేదికను సెబీకి సమర్పించాలి. వాటాదారులతో సంబంధాలు, పర్యావరణ సంబంధిత అంశాలతో కూడిన ఈ నివేదికను ఈ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాప్‌ 500 కంపెనీలకే వర్తించే ఈ నిబంధన ఇప్పుడు టాప్‌ 1000 కంపెనీలకు వర్తించనున్నది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు