ఐసీఐసీఐకు సెబీ షాక్‌

13 Sep, 2019 13:02 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద  ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకునకు సెబీ షాకిచ్చింది. ఒప్పందాలను దాచి పెట్టిందన్న కారణంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాంకుతో పాటు, దాని కంప్లెయిన్స్‌ అధికారి సందీప్ బాత్రాకు భారీ జరిమానా విధించింది. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్నిరిపోర్టు చేయడంలో ఆలస్యం, ఇతర కొన్ని ముఖ‍్యమైన విషయాలను బహిర్గతం చేయడంలో లోపాల కారణంగా   బ్యాంకునకు రూ. 10లక్షలు,  సందీప్‌ బాత్రాకు రూ. 2 లక్షలు మొత్తం రూ.12 లక్షల జరిమానా విధించింది.  

కాగా 2010, మే 18న  బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌తో ఐసీఐసీఐ బ్యాంకు బైండిగ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఒప‍్పందానికి సంతకాలు చేసింది.  అయితే ఈ ఒప్పందాన్ని రెగ్యులేటరీ సంస్థలకు నివేదించడంలో ఆలస్యం చేసింది. బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసిన సమాచారాన్ని సకాలంలో  స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలో  ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైందని దర్యాప్తులో తేలిందని సెబీ తన ఆర్డర్‌లో తెలిపింది.

>
మరిన్ని వార్తలు