రూ. 813 కోట్లు కట్టండి సత్యం రామలింగరాజు

3 Nov, 2018 00:42 IST|Sakshi

తదితరులకు సెబీ తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 813 కోట్లు కట్టాలంటూ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తదితరులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. అలాగే 14 ఏళ్ల పాటు వారు సెక్యురిటీస్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా నిషేధం విధించింది. సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ సూచనల ప్రకారం సెబీ ఈ మేరకు కొత్తగా మళ్లీ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ఆదేశించిన రూ. 1,258.88 కోట్ల మొత్తాన్ని తాజాగా రూ. 813.40 కోట్లకు తగ్గించింది. ఇందులో ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ రూ. 675 కోట్లు, రామలింగ రాజు దాదాపు రూ. 27 కోట్లు, సూర్యనారాయణ రాజు రూ. 82 కోట్లు, రామ రాజు సుమారు రూ. 30 కోట్లు, కట్టాల్సి ఉంటుంది. స్కాము వెలుగులోకి వచ్చిన 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి. మరోవైపు, నిషేధానికి సంబంధించి ఇప్పటికే అమలైన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సెబీ పేర్కొంది.  

మరిన్ని వార్తలు