పీడబ్ల్యూసీకి సెబీ షాక్‌!

12 Jan, 2018 00:22 IST|Sakshi

దేశంలో రెండేళ్లు ఆడిట్‌ చేపట్టకుండా నిషేధం

రూ.13 కోట్లు తిరిగి చెల్లించాలంటూ ఆదేశం

సత్యం కేసులో తొమ్మిదేళ్ల తర్వాత ఉత్తర్వులు  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆడిటింగ్‌ దిగ్గజం ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కంప్యూటర్స్‌ ఖాతాలను ఈ సంస్థే ఆడిట్‌ చేసినా... కంపెనీ లాభనష్టాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వెల్లడికాలేదు. చివరకు ప్రమోటర్‌ రామలింగరాజు వెల్లడించాకే విషయాలన్నీ బయటికొచ్చాయి. సత్యం ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన ఈ వ్యవహారంలో... దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పీడబ్ల్యూసీని సెబీ దోషిగా తేల్చింది.

ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్‌వర్క్‌ సంస్థలు రెండేళ్ల పాటు భారత్‌లోని లిస్టెడ్‌ కంపెనీలకు ఆడిట్‌ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్‌ ఖాతాలు ఆడిటింగ్‌ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్లకు పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని 108 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, పీడబ్ల్యూ నెట్‌వర్క్‌ సంస్థలు 2017–18కి సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఆడిటింగ్‌ అసైన్‌మెంట్స్‌పై దీని ప్రభావం ఉండదని తెలిపింది.

సెబీ ఆదేశాలపై తాము స్టే తెచ్చుకుంటామని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ ధీమా వ్యక్తం చేయగా, ఉత్తర్వులను పరిశీలించనున్నట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి చెప్పారు. ఆడిటర్లకు సంబంధించి ఇప్పటికే కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటిని అమలు మాత్రమే చేయాల్సి ఉందని తెలిపారు.

దేశీ కార్పొరేట్‌ రంగాన్ని కుదిపేసిన రూ. 7,000 కోట్ల సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం 2009లో బయటపడింది. ఆ తర్వాత కంపెనీ చైర్మన్‌ రామలింగరాజు జైలుకెళ్లడం, సంస్థను టెక్‌ మహీంద్రా టేకోవర్‌ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవధిలో పీడబ్ల్యూసీ రెండు సార్లు రాజీ యత్నాలకు ప్రయత్నించినా విఫలమయింది. అయితే, అమెరికాలో మాత్రం రాజీ చేసుకోగలిగింది. బిగ్‌ ఫోర్‌గా పరిగణించే నాలుగు దిగ్గజ ఆడిటింగ్‌ కంపెనీల విషయంలో ఇంత తీవ్రమైన ఆదేశాలు జారీ కావడం దేశంలో ఇదే ప్రథమం.

గోపాలకృష్ణన్, శ్రీనివాస్‌ తాళ్లూరిలకు 3 ఏళ్లు..
ప్రైస్‌ వాటర్‌హౌస్‌ మాజీ భాగస్వాములు గోపాలకృష్ణన్, శ్రీనివాస్‌ తాళ్లూరి మూడేళ్ల పాటు లిస్టెడ్‌ సంస్థలకు ఆడిట్‌ సర్టిఫికెట్లు జారీ చేయరాదని సెబీ స్పష్టంచేసింది. 2000–2008 మధ్య కాలంలో ప్రైస్‌ వాటర్‌హౌస్‌ సంస్థలు ఆడిటింగ్‌ సేవలకు గాను సత్యం నుంచి రూ. 23 కోట్లు ఫీజుగా పొందగా.. ఇందులో రూ. 13 కోట్లు పీడబ్ల్యూ బెంగళూరుకి లభించాయని సెబీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రైస్‌ వాటర్‌హౌస్‌ బెంగళూరు విభాగంతో పాటు ఎస్‌ గోపాలకృష్ణన్, శ్రీనివాస్‌ తాళ్లూరి అనుచితంగా లబ్ధి పొందిన మొత్తం రూ. 13 కోట్లు, 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. ఇందుకు 45 రోజుల గడువు ఇచ్చింది.

స్టే తెచ్చుకుంటాం: పీడబ్ల్యూసీ
సెబీ విచారణ, తీర్పు తమను నిరాశపరిచినట్లు పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చే లోగా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ చూడని విధంగా సత్యం యాజమాన్యం చేసిన మోసంలో పీడబ్ల్యూ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పూ చేయలేదనే 2009 నుంచీ చెబుతున్నాం. తాజా తీర్పు 2011లో బాంబే హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. దీనిపై స్టే తెచ్చుకోగలమని భావిస్తున్నాం‘ అని వెల్లడించింది.


కొత్త ఆడిటర్ల వేటలో కంపెనీలు..
ప్రైస్‌ వాటర్‌హౌస్‌ నెట్‌వర్క్‌ సంస్థలపై సెబీ నిషేధం విధించిన నేపథ్యంలో ప్రస్తుతం వాటి సర్వీసులు ఉపయోగించుకుంటున్న అనేక లిస్టెడ్‌ కంపెనీలు కొత్త ఆడిటర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీడబ్ల్యూసీ నెట్‌వర్క్‌ కింద భారత్‌లో ప్రస్తుతం 11 సంస్థలు ఉండగా.. 3,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. దేశీయంగా 75 లిస్టెడ్‌ కంపెనీలకు ఈ సంస్థలు ఆడిటింగ్‌ సేవలు అందిస్తున్నాయి.

2017–18 ఏడాది ఆడిటింగ్‌పై తీర్పు ప్రభావం ఉండదని సెబీ చెప్పినప్పటికీ.. తర్వాతైనా సరే ఈ లిస్టెడ్‌ కంపెనీలు మరో ఆడిటర్‌ను వెతుక్కోవాలి. మరోవైపు, సెబీ ఆదేశాల నేపథ్యంలో పరోక్షంగానైనా.. అన్‌లిస్టెడ్, ఇతర సంస్థలకు ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అందించే ఆడిటింగ్‌ సేవలపైనా ప్రశ్నలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు