కార్వీ తరహా మోసాలకు చెక్‌

18 Feb, 2020 04:11 IST|Sakshi

చర్యలు తీసుకుంటామన్న సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి

సంతృప్తికరంగా పదవీ కాలం

ఫండ్‌ స్కీమ్‌ల పునఃవర్గీకరణ..!

ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల అర్హతలు మరింత కఠినం

ముంబై: భవిష్యత్తులో కార్వీ తరహా మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ చీఫ్‌ అజయ్‌ త్యాగి చెప్పారు. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కార్వీ బ్రోకింగ్‌ సర్వీసెస్‌పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నెల 14 నాటికి కార్వీ సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.1,189 కోట్లుగా ఉన్నాయని త్యాగి పేర్కొన్నారు. ఈ విషయమై కార్వీకి నోటీసులు జారీ చేశామని వివరించారు. తమ కంపెనీల్లో ఒక దాంట్లో వాటా విక్రయ ప్రయత్నాలు చేస్తున్నామని, అది పూర్తవ్వగానే ఈ బకాయిలను చెల్లిస్తామని, మార్చి కల్లా అన్ని బకాయిలను చెల్లిస్తామని  కార్వీ వెల్లడించిందని వివరించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్‌ సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సెబీ బోర్డ్‌ ఆమోదించింది.

సంతృప్తికరంగానే... 
ఈ నెలలోనే సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. తన హయాంలో పారదర్శకంగా, సంప్రదింపుల పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించామని, అధికారం చెలాయించడానికి ప్రయత్నించలేదని అజయ్‌ త్యాగి పేర్కొన్నారు. తన హయాం సంతృప్తికరంగానే గడిచిందని తెలిపారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్‌ కీలక నిర్ణయాలు ఇవీ...,  
►కంపెనీల్లో చైర్మన్, ఎమ్‌డీ పోస్ట్‌ల విభజన విషయంలో పలు ఆచరణాత్మక, పరిపాలనా పరమైన సమస్యలున్నాయి. అందుకే ఈ పోస్ట్‌ల విభజనకు గడువును మరో రెండేళ్లు (2020, ఏప్రిల్‌ వరకూ) పొడిగించారు. 
►స్మాల్, మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌ల పునః వర్గీకరణపై మరింత కసరత్తు జరుగుతోంది.  త్వరలోనే మార్గదర్శకాలను వెల్లడించనున్నది.  
►ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం మదుపు సలహాదారుల(ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల) అర్హతలను మరింత కఠినతరం చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఫీజులపై గరిష్ట పరిమితిని నిర్దేశించనున్నది.

మరిన్ని వార్తలు