ఇన్ఫీపై సెబీ విచారణ

24 Oct, 2019 05:15 IST|Sakshi

సీఈవో మీద ఆరోపణలపై దృష్టి

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోణంలోనూ దర్యాప్తు

విచారణకు మేనేజ్‌మెంట్‌ను పిలిచే అవకాశం

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇన్ఫోసిస్‌ షేర్లలో ట్రేడింగ్‌ డేటాతో పాటు డెరివేటివ్‌ పొజిషన్ల గురించిన వివరాలు ఇవ్వాలని స్టాక్‌ ఎక్సే్చంజీలకు సెబీ సూచించినట్లు వివరించాయి. ఈ వివాదంపై ఇన్ఫీ టాప్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతరత్రా కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇన్వెస్టిగేషన్‌ పురోగతిని బట్టి ఆడిటింగ్‌ సహా ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసే బోర్డు కమిటీల నుంచి కూడా సెబీ వివరాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

స్వతంత్ర డైరెక్టర్లపైనా దృష్టి..: ఈ వ్యవహారంలో ఇన్ఫీ స్వతంత్ర డైరెక్టర్ల తీరుపైనా సెబీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజావేగు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇన్ఫీ యాజమాన్యం.. స్టాక్‌ ఎక్సే్చంజీలకు, సెబీకి సత్వరం తెలియజేసేలా, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటంలో స్వతంత్ర డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరించారన్నది తెలుసుకోనుంది. మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదు గురించి సత్వరం ఎందుకు తెలియజేయలేదో వివరణనివ్వాలంటూ ఇన్ఫోసిస్‌కు బుధవారం బోంబే స్టాక్‌ ఎక్సే్చంజీ (బీఎస్‌ఈ) సూచించింది. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సీఈవో సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంబించారంటూ ’నైతిక ఉద్యోగుల బృందం’ పేరిట కొందరు ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్‌ బోర్డుకు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోని ఆఫీస్‌ ఆఫ్‌ ది విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాంకు కూడా ప్రజావేగుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. సోమవారం బైటికొచ్చిన ఈ వార్తలతో ఇన్ఫీ షేరు మంగళవారం భారీగా పతనమైంది. అటు అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేయనున్నట్లు రోజెన్‌ లా ఫర్మ్‌ అనే న్యాయసేవల సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలేకని వెల్లడించారు.  

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఇన్ఫోసిస్‌ షేరు సుమారు ఒక్క శాతం లాభపడింది. బీఎస్‌ఈలో రూ. 650.75 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్‌ మొదలయ్యాక ఒకానొకదశలో 4.5% మేర దిగజారి రూ.615 కనిష్ట స్థాయిని కూడా తాకింది.

మరిన్ని వార్తలు