పోంజీ ఆర్డినెన్సుకు త్వరలో చట్ట రూపం

22 Jun, 2014 02:45 IST|Sakshi
పోంజీ ఆర్డినెన్సుకు త్వరలో చట్ట రూపం

సెబీ చైర్మన్ సిన్హా ఆశాభావం

న్యూఢిల్లీ: స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధానికి జారీ చేసిన ఆర్డినెన్సు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. మదుపర్లను మోసగిస్తూ అక్రమ పద్ధతుల్లో డిపాజిట్ల సేకరణ ఇప్పటికీ భారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పోంజీ వ్యతిరేక ఆర్డినెన్సును గతేడాది నుంచి ఇప్పటికి 3 సార్లు జారీ చేశా రు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే చట్టరూపం దాలుస్తుంది.
 
పన్ను ప్రయోజనాలపై స్పష్టత..
క్యాపిటల్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల (ఆర్‌ఈఐటీ) వంటి కొత్త ప్రొడక్టులపై పన్ను ప్రయోజనాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిన్హా కోరారు. ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు, డెబిట్ సెక్యూరిటీలకు ట్యాక్స్ బెనిఫిట్లపైనా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్‌ఈఐటీలకు సంబంధించిన నిబంధనలను సెబీ త్వరలోనే ఖరారు చేస్తుందనీ, అయితే పన్ను సంబంధ అంశాల్లో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామనీ తెలిపారు.
 
ఏకరీతి పన్నులు అవసరం..
బాండ్ మార్కెట్లో లోటుపాట్ల తొలగింపునకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని సెబీ చైర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బాండ్లలో పెట్టుబడులు చేసే సంస్థలపై పన్ను రేట్లు భిన్న రకాలుగా ఉన్నాయని చెప్పారు. లోటుపాట్లున్నంత కాలం వీటిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సందేహిస్తారని అన్నారు. ఇన్వెస్టర్లందరిపైనా పన్నులు ఒకే రకంగా ఉండాలని తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు