దలాల్ స్ట్రీట్ లో దందా: భారీగా పన్ను ఎగవేత

16 May, 2017 09:49 IST|Sakshi
దలాల్ స్ట్రీట్ లో దందా: భారీగా పన్ను ఎగవేత
స్టాక్ మార్కెట్లో భారీగా పన్ను ఎగవేత కేసులు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను దుర్వినియోగం చేస్తూ దాదాపు 11వేల కేసులు  పెన్నీ స్టాక్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు తెలిసింది. పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న  సంస్థల జాబితాను తయారుచేసిన సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ), ఈ జాబితాను పన్ను అధికారులకు పంపింది. దీనిలో మూలధన లాభాల ప్రొవిజన్స్ ను దుర్వినియోగం చేస్తూ 34వేల కోట్ల రూపాయల పన్నులను 11వేల సంస్థలు ఎగొట్టినట్టు ఆదాయపు పన్నుశాఖకు తెలిపింది. ఈ డేటాను పన్ను అధికారులతో షేర్ చేసుకున్న సెబీ, 11వేల సంస్థలపై విచారణను రివీల్ చేసింది.
 
ఈ సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు జరుపకుండా గత మూడేళ్లలో ఒక్కోటి 5 లక్షలకు పైగా లిస్టెడ్ కంపెనీలషేర్లను కొనుగోలుచేసినట్టు పేర్కొంది. మూడేళ్ల డేటా అనాలటిక్స్, ట్రేడింగ్, సర్వైలెన్స్ డేటా ఆధారంగా వీటిని గుర్తించినట్టు సెబీ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ కూడా సెబీ పన్ను ఎగవేతదారుల జాబితాను పంపినట్టు ధృవీకరించింది. పన్ను ఎగొట్టడానికి ఈ సంస్థలు స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగపరుస్తున్నాయని, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని  ఐటీ అధికారులు చెప్పారు. 12 నెలల కంటే ఎక్కువ రోజులు పెట్టుబడులు పెట్టి, షేర్లను విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండదు. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని, కంపెనీలు ఈ దుర్వినియోగాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. దీనిలో ఎక్కువ కోల్ కత్తా, ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీకి చెందిన పన్ను ఎగవేతదారులే ఉన్నట్టు సెబీ పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు