రూపాయి.. జీవితకాల కనిష్టానికి!

6 Jul, 2018 01:16 IST|Sakshi

21 పైసల నష్టంతో  68.95 వద్ద ముగింపు ​​​​​​

రెండు రోజుల్లో 38 పైసలు నష్టం  

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం బుధవారం జీవిత కాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. రూపాయి పతనం కావడం ఇది వరుసగా రెండో రోజు. ఫారెక్స్‌ మార్కెట్లో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం 68.74 వద్ద ముగిసింది. ఈ ముగింపుతో పోల్చితే గురువారం ఉదయం రూపాయి 6 పైసల నష్టంతో 68.80 వద్ద ఆరంభమైంది. అమ్మకాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్రాడేలో 69.01 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 21 పైసల నష్టంతో 68.95 వద్ద ముగిసింది. రూపాయి మరీ పతనం కాకుండా, 69 స్థాయిలో ముగియకుండా ఆర్‌బీఐ జోక్యం చేసుకుందన్న సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. గత రెండు రోజుల్లో రూపాయి మొత్తం 38 పైసలు నష్టపోయింది. అమెరికా డాలర్లకు డిమాండ్‌ వెల్లువెత్తడం, విదేశీ నిధులు తరలిపోతుండటంతో రూపాయి క్షీణిస్తోందని నిపుణులంటున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచడంతో మన రూపాయితో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి.  

ఏప్రిల్‌ నుంచి పతనం... 
గత ఏడాది నల్లేరు మీద నడకలా సాగిన రూపాయి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పతనమవుతూనే ఉంది. గత నెల 28న జీవిత కాల గరిష్ట స్థాయి, 69.10ను తాకింది. ఇక ఈ నెల 2న జీవిత కాల కనిష్ట స్థాయి, 68.80 వద్ద ముగిసింది. ఆసియాలో అత్యంత అధ్వానంగా ఉన్న కరెన్సీల్లో మన రూపాయి కూడా ఒకటి.  

కరంట్‌ అకౌంట్‌ లోటు మరింత పైపైకి... 
ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మన కరంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనలు రేగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న మన ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముడి చమురు ధరలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించగలవన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావమే చూపుతోంది. ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచడంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందని, దీంతో ఆర్‌బీఐ అంచనాల కంటే అధికంగానే వడ్డీరేట్లను పెంచగలదన్న భయాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు