ఉక్కు ఉత్పత్తిలో త్వరలో 2వ స్థానానికి భారత్

24 May, 2017 00:35 IST|Sakshi
ఉక్కు ఉత్పత్తిలో త్వరలో 2వ స్థానానికి భారత్

కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌  
న్యూఢిల్లీ: ప్రపంచంలో స్టీల్‌ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ త్వరలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుందని కేంద్ర ఉక్కు వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ మంగళవారంనాడు ఇక్కడ తెలిపారు. తాను మంత్రిగా మూడేళ్లలో ఉక్కు శాఖ సాధించిన విషయాలను ఆయన వివరిస్తూ, ‘‘ప్రస్తుతం స్టీల్‌ రంగం గతంకన్నా ఎంతో పురోగతి సాధించింది. అప్పట్లో ఈ రంగంపై ఎంతో ఒత్తిడి ఉండేది. బ్యాంకింగ్, ఆర్‌బీఐకి తీవ్ర ఆందోళనకరమైనదిగా ఈ రంగం పనితీరు ఉండేది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేము ఎన్నో చర్యలు తీసుకున్నాం’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

300 ఎంటీల లక్ష్యం...: 2030–31 సంవత్సరానికి 300 ఎంటీల ఉత్పత్తి లక్ష్యంగా కొత్త స్టీల్‌ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2015లో అమెరికాను నాల్గవ స్థానానికి నెట్టి, భారత్‌ స్టీల్‌ ఉత్పత్తిలో మూడవ స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రస్తుతం స్టీల్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండవ స్థానంలో జపాన్‌ ఉంది. గత ఏడాది భారత్‌ స్టీల్‌ ఉత్పత్తి 100 ఎంటీ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు). జపాన్‌ విషయంలో ఈ పరిమాణం 104 ఎంటీలుగా ఉంది. చైనా  ఉత్పత్తి దాదాపు 808 ఎంటీలయితే, అమెరికా విషయంలో దాదాపు 78 ఎంటీలుగా ఉంది.

మరిన్ని వార్తలు