డాక్టర్‌ రెడ్డీస్‌పై అమెరికాలో క్లాస్‌యాక్షన్‌ దావా

30 Nov, 2017 01:28 IST|Sakshi

స్టాక్‌మార్కెట్‌ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణ  

న్యూఢిల్లీ: దేశీ ఔషధ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌పై అమెరికాలో కొంతమంది ఇన్వెస్టర్లు దావా వేశారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ తమపై న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సెక్యూరిటీస్‌ క్లాస్‌ యాక్షన్‌ లా సూట్‌ దాఖలైందని కంపెనీ బుధవారం దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కార్పొరేట్‌ నాణ్యతా వ్యవస్థకు సంబంధించి తప్పుడు ప్రకటనలు, సమాచారాన్ని దాచిపెట్టడం వంటి చర్యలవల్ల షేరు ధర పతనమైందనేది ఇన్వెస్టర్ల ప్రధాన ఆరోపణ. దీనికి కారణమైన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లను(ఏడీఆర్‌) కొనుగోలు చేసిన కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి న్యాయ సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా, తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారౖమైనవని.. దీన్ని చట్టపరంగా తాము ఎదుర్కోనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మరోమారు స్పష్టం చేసింది. బుధవారం డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ధర బీఎస్‌ఈలో స్వల్పంగా 0.22 శాతం నష్టంతో రూ.2,283 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు