బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

4 Aug, 2017 01:52 IST|Sakshi
బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

సెన్సెక్స్‌ 239 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు డౌన్‌

భవిష్యత్తులో రిజర్వుబ్యాంక్‌ పరపతి విధానం పట్ల సందేహాలు తలెత్తడంతో గురువారం వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో స్టాక్‌ సూచీలు వరుసగా రెండోరోజు క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 239 పాయింట్లు (0.74 శాతం) పతనమై 32,238 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒకదశలో 10,000 పాయింట్ల స్థాయిని సైతం కోల్పోయింది.

చివరకు 68 పాయింట్ల (0.67 శాతం) తగ్గుదలతో 10,014 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టాక్‌ సూచీలు ఇంతగా తగ్గడం రెండు వారాల్లో ఇదే ప్రధమం. ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో రెపో రేటును పావుశాతం తగ్గించినప్పటికీ, భవిష్యత్తులో రేట్ల కోత వివిధ ఆర్థిక గణాంకాల ఆధారంగా వుంటాయని సూచనాప్రాయంగా వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అసహనానికి గురైనట్లు, దీనితో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌  నాయర్‌ తెలిపారు.

బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం డౌన్‌...
పలు బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు జరగడంతో ప్రధాన సూచీలకంటే బ్యాంక్‌ నిఫ్టీ అధికంగా క్షీణించింది. 1.5 శాతంపైగా తగ్గిన బ్యాంక్‌ నిఫ్టీ 24,675 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అన్నింటికంటే ఎక్కువగా 5.98 శాతం క్షీణించి రూ. 150లోపున క్లోజయ్యింది. కెనరా బ్యాంక్‌ 3.27 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3 శాతం, ఎస్‌బీఐ 2.24 శాతం చొప్పున తగ్గాయి. ప్రైవేటు బ్యాంకింగ్‌ షేర్లు యాక్సిస్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్‌ బ్యాంక్‌లు 1.5–2.5 శాతం మధ్య తగ్గాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు...
బహుళ వ్యాపారాల దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 2 శాతం ర్యాలీ జరిపి, రూ. 1,650 వద్ద ముగియడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2008 జనవరిలో బీఎస్‌ఈలో నమోదుచేసిన రూ.1,629 గరిష్టస్థాయిని కొద్దిరోజుల క్రితమే ఆర్‌ఐఎల్‌ అధిగమించినప్పటికీ, అప్పట్లో ఎన్‌ఎస్‌ఈలో నమోదైన రూ. 1,649 గరిష్టరికార్డును గురువారం దాటి ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ. 1,665 వద్దకు పెరిగింది. తాజా మార్కెట్‌ విలువ రూ.5.37 లక్షల కోట్లకు చేరింది. పెరిగిన షేర్లలో భారతి ఎయిర్‌టెల్, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్, ఏసీసీ, అంబూజా సిమెంట్‌లు వున్నాయి.

>
మరిన్ని వార్తలు