బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు

13 Jul, 2020 15:01 IST|Sakshi

సూచీలను వెనక్కి లాగిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు వెల్లుత్తాయి. ఫలితంగా సూచీలు సోమవారం ఉదయం ఆర్జించిన భారీ లాభాల్ని మిడ్‌సెషన్‌ కల్లా కోల్పోయి స్వల్పనష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన బ్యాంకింగ్‌ రంగ షేర్లతో పాటు ఫైనాన్స్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫైనాన్స్‌ సర్వీస్‌, నిఫ్టీ ప్రభుత్వరంగ, ప్రైవేట్‌ రంగ ఇండెక్స్‌లు 1.50శాతానికి పైగా క్షీణించాయి. 

బ్యాంకింగ్‌ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 1.75శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇక ఫైనాన్స్‌ రంగంలో హెవీ వెయిటేజీ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నష్టాన్ని చవిచూశాయి. 

మధ్యాహ్నం గం.2:30ని.లకు సెన్సెక్స్‌ 36567 వద్ద, నిఫ్టీ 10769 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లతో పాటు రియల్టీ రంగ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోంటున్నాయి.

మరిన్ని వార్తలు