సెంబ్ కార్ప్ గాయత్రీ థర్మల్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు!

22 Mar, 2016 01:53 IST|Sakshi
సెంబ్ కార్ప్ గాయత్రీ థర్మల్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు!

రూ. 12,000 కోట్లతో 5,280 మెగావాట్లకు పెంపు
వచ్చే ఏడాదిలోగా రెండు బీవోటీ ప్రాజెక్టుల విక్రయ లక్ష్యం
గాయత్రి ప్రాజెక్ట్స్ ఎండీ సందీప్ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్‌తో కలసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ధర్మల్ విద్యుత్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో ఈ భాగస్వామ్య కంపెనీ రెండు దశల్లో 2,640 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో ఈ  సామర్థ్యాన్ని 5,280 మెగావాట్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు గాయత్రీ గ్రూపు వ్యవస్థాపకుడు టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ. 12,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఉత్పత్తి వ్యయం రెట్టింపు చేసే అవకాశం ఉందన్నారు.

దాదాపు రూ. 20,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రీ ప్రాజెక్ట్స్ ఎండీ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత యూనిట్‌ను రెండు దశల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటికే 1,320 మెగావాట్ల యూనిట్ పనిచేస్తుండగా, మిగిలిన 1,320 మెగావాట్ల యూనిట్ సెప్టెంబర్‌లోగా వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కాంప్లెక్స్‌లో తగినంత భూమి లభ్యత ఉండటంతో ఇప్పటితో పోలిస్తే సగం ఖర్చుతోనే ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విస్తరణపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

 ప్రస్తుతం గాయత్రీ ప్రాజెక్ట్స్ చేతిలో రూ. 10,000 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టులు చేతిలో ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గాయత్రీ ప్రాజెక్ట్స్ అభివృద్ధి చేసిన ఏడు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించే యోచనలో ఉన్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో ముందడుగు పడటం లేదన్నారు. ఈ ప్రాజెక్టుల నుంచి టోల్ ఫీజుల రూపంలో ఆదాయం వస్తుండటంతో వెంటనే అమ్మాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఏడాదిలోగా కనీసం రెండు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు