మాల్యాను అప్పగించండి..

29 Apr, 2016 00:09 IST|Sakshi
మాల్యాను అప్పగించండి..

బ్రిటన్‌కు భారత్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బ్రిటన్‌కు పరారైన ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ విజయ్‌మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్‌కు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక లేఖ రాసింది. బ్యాంకులకు రూ.9,400 కోట్ల బకాయి, పాస్‌పోర్ట్ సస్పెన్షన్, నాన్-బెయిలబుల్ వారంట్, సుప్రీంకోర్టులో కేసు విచారణ వంటి అంశాలను లేఖలో వివరించినట్లు విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

మాల్యాను భారత్‌కు తీసుకువచ్చే అంశంపై బ్రిటన్ అధికారులతో భారత్ తన చర్చలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌లోని భారత్ హై కమిషన్ కూడా బ్రిటన్ విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయానికి మాల్యాను భారత్‌కు పంపే విషయమై లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. మార్చి 2న మాల్యా బ్రిటన్ వెళ్లినట్లు భావిస్తున్నారు.

 మాల్యా తదుపరి చర్య!
తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా బ్రిటన్ అధికారులను ఆశ్రయించి, తాను దేశంలో కొనసాగేలా అనుమతించాలని కోరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాస్‌పోర్ట్ రద్దును కూడా ఆయన సవాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసులో భారత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విజ్ఞప్తి మేరకు ముంబై ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సీల్డ్‌కవర్‌లో తెలియజేసిన మాల్యా, దేశానికి వచ్చే విషయంలో మాత్రం ఎటువంటి సూచనా చేయలేదు. తాను దేశానికి వచ్చిన మరుక్షణం తీహార్ జైలుకు పంపిస్తారన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండు నెలల్లో ఆయనపై బ్యాంకింగ్ రికవరీ కేసులను బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంది.

30న కింగ్‌ఫిషర్ ట్రేడ్‌మార్క్‌ల వేలం
ఇదిలావుండగా... ఈ నెల 30న కింగ్‌ఫిషర్ లోగో, ‘ప్లై ది గుడ్ టైమ్స్’(టేగ్‌లైన్) ట్రేడ్‌మార్క్‌ల వేలానికి బ్యాంకింగ్ రంగం సిద్ధం చేసింది. ఫ్లైయింగ్ మోడల్స్, ఫ్లై ది గుడ్ టైమ్స్, ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లైయింగ్ బర్డ్ డివైస్‌సహా ట్రేడ్‌మార్క్‌లకు రిజర్వ్ ప్రైజ్ ధర రూ.366 కోట్లు. రుణాలు పొందే ప్రక్రియలో ఈ ట్రేడ్‌మార్క్‌లను సంస్థ బ్యాంకులకు తనఖాగా పెట్టింది. ఈ ఆన్‌లైన్ వేలాన్ని ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ (ఎస్‌బీఐ క్యాప్స్ అనుబంధ సంస్థ) నిర్వహిస్తుంది. అయితే ఒకప్పుడు మంచి ధర ఉన్న ఈ బ్రాండ్స్‌కు ఇప్పుడు విలువ పడిపోయిందని, వీటి కోసం బిడ్డర్స్ నుంచి ఎటువంటి ఆసక్తీ ఉండకపోవచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గత నెలల్లో కింగ్‌ఫిషర్ హౌస్ వేలం విజయవంతం కాలేదు. రూ. 150 కోట్ల రిజర్వ్ ప్రైస్ అధికమని భావించిన బిడ్డర్లు ఈ వేలంపై ఆసక్తి చూపలేదు.

మరిన్ని వార్తలు