ఎక్కువ వడ్డీ... ఎక్కువ భద్రత!

28 May, 2018 00:18 IST|Sakshi

సీనియర్లకు సేవింగ్స్‌ స్కీమ్‌ బెటరే

8.3 శాతం రాబడులు, ఐదేళ్ల కాల వ్యవధి

కావాలనుకుంటే మరో మూడేళ్లు పొడిగింపు

పెట్టుబడిపై తొలి ఏడాది పన్ను మినహాయింపు

వడ్డీ ఆదాయం రూ.50,000 దాటితేనే పన్ను

ప్రతి మూడు నెలలకూ వడ్డీ ఆదాయం చేతికి

గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్‌కు అవకాశం

దేశంలో అత్యధిక జనాభాది అయితే స్వయం ఉపాధి... లేకుంటే ప్రయివేటు ఉద్యోగమే. అందుకే ఇక్కడ వృద్ధాప్యంలో సామాజిక భద్రతనేది చాలా పెద్ద సమస్య. అప్పటిదాకా కొంత సొమ్ము దాచుకున్నా... దానిపై నెలనెలా ఎంతో కొంత సొమ్ము చేతికి వస్తుండాలి. అది కూడా స్థిరంగా ఉండి... ఎలాంటి ఆందోళనకూ తావివ్వని రీతిలో ఉండాలి. రిస్క్‌ తీసుకోలేరు కనక... ఒకవైపు పెట్టుబడికి భద్రత, మరోవంక మెరుగైన రాబడి అవసరం. అందుకనే ఇపుడు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ను (ఎస్‌సీఎస్‌ఎస్‌) మంచి ఆప్షన్‌గా సూచిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ ప్రధాన కథనం.. సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


మూడు నెలలకోసారి వడ్డీ
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ను ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టింది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ ఆదాయాన్ని అందించడం ద్వారా సీనియర్‌ సిటిజన్ల అవసరాలకు నిధులివ్వటమే ఈ పథకం వెనక అసలు ఉద్దేశం. వడ్డీ తీసుకోకుండా వదిలేస్తే దానిపై మరింత రాబడి పొందే అవకాశం దీన్లో లేదు. మూడు నెలలకోసారి వడ్డీ తీసుకోవాల్సిందే. త్రైమాసికానికి ఎంత చెల్లిస్తారనేది డిపాజిట్‌ మొత్తం, వడ్డీ రేటు ఆధారంగా ప్రారంభంలోనే ఖరారు చేస్తారు.

ప్రారంభించటం ఎలా..?
రిటైర్మెంట్‌ సమయంలో వచ్చిన నిధుల్ని ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకే డిపాజిట్‌ చేసే అవకాశముంది. ఏ పోస్టాఫీసుకు వెళ్లినా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. లేదా ప్రభుత్వరంగ బ్యాంకులైన ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఆంధ్రా బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకుల్లో ఎంపిక చేసిన శాఖల్లోనూ ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాను తెరుచుకోవచ్చు.

ప్రయివేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకూ దీన్ని ఆఫర్‌ చేస్తోంది.దీనికోసం ముందుగా సేవింగ్స్‌ ఖాతాను తెరవాలి. తర్వాత దరఖాస్తు పత్రం, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం (ఒరిజినల్‌), చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్‌ పోర్ట్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ ఐడీ వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. పాన్‌కార్డు లేనివారు చట్టంలోని నిబంధనల మేరకు ఫామ్‌ 60 లేదా 61ను డిక్లరేషన్‌గా ఇవ్వాలి.

ఎవరైనా ప్రారంభించొచ్చా?
60 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లు అందరూ ఈ పథకంలో చేరటానికి అర్హులే. ఉద్యోగం నుంచి ముందే రిటైర్‌ అయిన వారు 55 ఏళ్లకే ఇందులో చేరొచ్చు. రక్షణ రంగంలో పనిచేసి ఎక్స్‌ సర్వీస్‌ హోదా కలిగిన వారు 50 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది.

పన్ను ప్రయోజనాలివీ...
ఆదాయపన్ను చట్టం (ఐటీ) లోని సెక్షన్‌ 80సీ కింద ఎస్‌సీఎస్‌ఎస్‌లో చేసే డిపాజిట్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను వర్తిస్తుంది. కాగా ఈ వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితేనే పన్ను. రూ.50,000 దాటినా టీడీఎస్‌ మినహాయించకూడదంటే ఫామ్‌ 15హెచ్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.


ఎస్‌సీఎస్‌ఎస్‌ – ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌
సాధారణ ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటుతో పోలిస్తే ఎస్‌సీఎస్‌ఎస్‌లో వడ్డీ రేటు సుమారు ఒక శాతం ఎక్కువ. ఉదాహరణకు ఎస్‌బీఐ 3–5 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు 7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకంలోని 8. 3 శాతం వడ్డీ రేటుతో పోల్చి చూస్తే 1.3%తక్కువ.
  రెగ్యులర్‌ టర్మ్‌ డిపాజిట్‌లో లాకిన్‌ పీరియడ్‌ ఉండకపోవటం మంచిదే. పైగా వీటిపై వడ్డీని మెచ్యూరిటీ సమయంలో తీసుకునేందుకు క్యుములేటివ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఎస్‌సీఎస్‌ఎస్‌లో ఇది లేదు. రెగ్యులర్‌గా ఆదాయం అవసరం లేదనుకునే వారికి, వడ్డీ కాస్త తక్కువైనా ఫర్వాలేదనుకునే వారికి టర్మ్‌ డిపాజిట్లే మార్గం. కానీ, సీనియర్‌ సిటిజన్లకు  ఎప్పటికప్పుడు ఆదాయాన్నిచ్చే పథకాల అవసరమే ఎక్కువ. అందుకుని వారికి ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకం అనువుగా ఉంటుంది.


వడ్డీ రేటు ఎంతంటే...
కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు  (ఏప్రిల్‌–జూన్‌) ఈ పథకంలో వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి వడ్డీ చెల్లిస్తారు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. పెట్టుబడి పెట్టే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఐదేళ్ల వరకు వర్తిస్తుంది.

ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌. అంటే ఐదేళ్లలోపు అవసరం ఏర్పడినా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేరు. తర్వాత పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తే మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. పొడిగించుకోకపోతే, ఐదేళ్లు కూడా ముగిసిపోతే ఆ డిపాజిట్‌ కాల వ్యవధి తీరిపోయినట్టే. ఎప్పుడైనా విత్‌ డ్రా చేసుకోవచ్చు.

ఐదేళ్ల డిపాజిట్‌ గడువు ముగిసిన వెంటనే విత్‌ డ్రా చేసుకోకుండా కొన్ని రోజుల తర్వాత తీసుకున్నారనుకోండి. అప్పుడు ఆ కాల వ్యవధిపై అమల్లో ఉన్న వడ్డీ రేటును చెల్లిస్తారు. ఏడాది తర్వాత ముందస్తు ఉపసంహరణను 1.5 శాతం పెనాల్టీపై అనుమతిస్తారు. రెండేళ్ల తర్వాత అయితే 1 శాతం నష్టపోవాలి.

మరిన్ని వార్తలు