సెన్సెక్స్‌ 205 పాయింట్లు అప్‌...

12 Dec, 2017 01:29 IST|Sakshi

సానుకూలంగా  అంతర్జాతీయ సంకేతాలు 

మూడో రోజూ లాభాల్లో సూచీలు 

205 పాయింట్ల లాభంతో 33,456కు సెన్సెక్స్‌ 

57 పాయింట్లు పెరిగి 10,322కు నిఫ్టీ  

గుజరాత్‌ ఎన్నికల్లో బీజీపీకే అనుకూల ఫలితాలు వస్తాయన్న అంచనాలకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు పటిష్టంగా ఉండటంతో అమెరికా, ఆసియా, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

యూరప్‌ మార్కెట్లు లాభాల్లో  ప్రారంభం కావడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడటం, చైనా వాణిజ్య గణాంకాలు ప్రోత్సాహకరంగానే ఉండటం  సానుకూల ప్రభావం చూపించాయి. స్టాక్‌ సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ  లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 205 పాయింట్ల లాభంతో 33,456 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 10,322 పాయింట్ల వద్ద ముగిశాయి.  

కొనసాగుతున్న మారుతీ  స్పీడు..: మారుతీ సుజుకీ జోరు కొనసాగుతోంది. సోమవారం కూడా ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి,9,167ని తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ. 9,133.8 వద్ద ముగిసింది. ఈ షేర్‌ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ  రూ.9,102 నుంచి రూ.10,563కు పెంచడం,  బుల్‌కేస్‌లో ఈ షేర్‌ రూ.14,400కు చేరగలదని పేర్కొనడంతో ఈ షేర్‌ దూసుకుపోయింది. కాగా యూనిటెక్‌ బోర్డ్‌లో పది మంది డైరెక్టర్లను నియమించడానికి ప్రభుత్వానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతినివ్వడంతో యూనిటెక్‌ షేర్‌ 11 శాతం పెరిగింది.   
 

మరిన్ని వార్తలు